Best Web Hosting Provider In India 2024
AP Police: జనమంతా ఇళ్లలో మునగదీసుకుని కూర్చున్న వేళ వరుణుడు విరుచుకుపడ్డాడు. బెజవాడలో భారీ వర్షం అంటే కాసేపట్లో ఆ నీరంతా కాల్వల్లోకి, కృష్ణా నదిలోకి వెళ్లిపోతుందనే అంచానాలు తలకిందులయ్యాయి. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం తెరిపినివ్వకుండా తెల్లవార్లు కురుస్తూనే ఉంది. ట్రాఫిక్ కూడళ్లలలో తీరిగ్గా విశ్రమించే పోలీసులు, అర్థరాత్రి పహారా కాచే పోలీసులు ప్రకృతి ప్రకోపాన్ని పసిగట్టారు. నగరంలోఅంతా ఆదమరిచి ఉన్న వేళ కురుస్తోన్న కుంభవృష్టిని చూసి అప్రమత్తం అయ్యారు.
వానొస్తే విరిగిపడే కొండచరియలు, పొంగి ప్రవహించే రోడ్లు బెజవాడలో సాధారణమే… అంతకు మించిని విపత్తు వచ్చిందని తెల్లవారుజామునే పోలీసులు గ్రహించారు. నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో కంట్రోల్ రూమ్‌లకు కాల్స్ పోటెత్తడంతో పరిస్థితి తీవ్రత పోలీసులకు అర్థమైపోయింది.
నగరమంతా పొంగి ప్రవహిస్తున్న ఔట్ ఫాల్ డ్రెయిన్లు, రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులు, జాతీయ రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాన నీటితో ఒక్కసారిగా విపత్తు విరుచుకుపడిన వేళ బెజవాడ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ముంచుకొస్తున్న విపత్తును పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులే ముందుగా పసిగట్టారు. అంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ నగరంలో ఏం జరుగుతుందో గ్రహించారు.విజయవాడను మునుపెన్నడూ లేని విపత్తు ముంచెత్తబోతుందని గ్రహించారు. తెల్లవారుజామున డ్యూటీలు మారే అవకాశం కూడా చాలామందికి దక్కలేదు. ఎక్కడ విధుల్లో ఉన్న వారు అక్కడే అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఉదయాన్నే ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు తెల్లవారు జాము నుంచి మొదలయ్యాయి. నిమిషాలు గంటలు దొర్లిపోతున్నా… గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లుబడినట్టు వర్షంకురుస్తూనే ఉంది.
శనివారం తెల్లవారుజామున కురుస్తోన్న వర్షం.. ఎప్పుడూ వచ్చేది కాదని పోలీసులకు అర్థమైపోయింది. విజయవాడలో గంట పాటు వర్షం కురిస్తే నగరం ఏమవుతుందో పోలీసులకు బాగా తెలుసు.. అలాంటిది గంటల తరబడి కురుస్తున్న వర్షంతో అలర్టయ్యారు. పోలీసులకు రోజువారి రొటీన్ విధులకంటే ముందే శనివారం మొదలైంది.
విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసుల సామర్ధ్యం సరిపోదని అధికారులకు గంటల్లోనే అర్థమైపోయింది. నగరంలో ఉండే ట్రాఫిక్ పోలసుల సామర్థ్యం పరిస్థితిని నియంత్రించడానికి సరిపోదని అర్థమైపోయింది. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా రోడ్ల మీదకు రావాలని ఉదయం పదిగంటలకల్లా ఆదేశాలు వచ్చేశాయి.
మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఐసీయూల్లో ఉన్న పేషెంట్లను కాపాడాలని కాల్స్ కంట్రోల్ రూమ్‌లకు పోటెత్తాయి. చెన్నై-కోల్కత్తా, చెన్నై-హైదరాబాద్ మార్గాల్లో జాతీయ రహదారులపై నీరు చేరింది. 2005 తర్వాత విజయవాడలో ఈ స్థాయి వరద ఉధృతిని ప్రజలు చూడలేదు. వరదలు, భారీ వర్షాలు సహజమే అయినా జనం ఏమాత్రం ఊహించని రీతిలో వానలు ముంచెత్తాయి. దీంతో పోలీసులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయారు.
పదుల సంఖ్యలో ట్రక్కులు, బస్సులు రహదారులపై నిలిచిపోయాయి. వర్షపు నీటిలో ముందుకు కదల్లేక పదుల సంఖ్యలో వాహనాలు రోడ్లపై మొరాయించాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే ట్యాంకర్లు అర్థాంతరంగా ఆగిపోయాయి. వాటి వెనుక కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. నీటిలో మొరాయించిన వాహనాలను పక్కకు తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
వాహనాలను ముందకు పంపేందుకు వాన నీటిలోనే వాటిని ముందుకు నెట్టారు. భారీ వాహనాలను అందుబాటులో ఉన్న వాహనాలతో తాళ్లు కట్టి పక్కకు లాగారు. 24గంటలకు పైగా విజయవాడ కమిషనరేట్ సిబ్బంది మొత్తం రోడ్లపైనే నిలిచి విపత్తుకు ఎదురొడ్డారు. కూలిన చెట్లను తొలగించారు. ఫైర్, రెవిన్యూ, డిజాస్టర్, కార్పొరేషన్ సిబ్బంది సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే. నగరంలో ఔట్ ఫాల్ డ్రెయిన్లు మొరాయించడంతో చాలా ప్రాంతాలు నీటిలో మునగడంతో కార్పొరేషన్ సిబ్బంది గంటల తరబడి వాన నీటిని మళ్లించేందుకు శ్రమించారు.
ఓ వైపు ప్రకృతితొ పోరాడుతూనే వివిఐపి వాహనాల నియంత్రన, రాకపోకల్ని నియంత్రించడం కోసం తంటాలు పడ్డారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు బయల్దేరడంతో పోలీసులు అల్లాడిపోయారు. శనివారం మధ్యాహ్నం , సాయంత్రం ఏ క్షణానైనా ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరుతారనే హెచ్చరికలు జారీ కావడంతో ఏ క్షణాన రోడ్లను క్లియర్ చేయాల్సి వస్తుందో తెలియక బెంబేలెత్తిపోయారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు మంత్రులు, సీనియర్ అధికారుల రాకపోకలు కొనసాగడంతో కంటి మీద కునుకు లేకుండా శ్రమించారు.
టాపిక్