Best Web Hosting Provider In India 2024
PM KUSUM Scheme : రైతుల కరెంట్ కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్(పీఎం కుసుమ్) పథకాన్ని 2019లో ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా సోలార్ పంపులు, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్లు, పునరుత్పాదక శక్తి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రైతులకు నీటి సదుపాయాల కోసం వాడుతున్న కరెంటు లేదా డీజిల్ మోటార్ల స్థానంలో అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని కరెంటు కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు, తాము వాడుకోగా మిగిలిన సౌర విద్యుత్ ను డిస్కంలకు విక్రయించుకుని ఆదాయం పొందేలా పీఎం కుసుమ్ పథకాన్ని రూపొందించారు.
రైతులు, డ్వాక్రా మహిళలు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు ఈ పథకానికి అర్హులు. అర్హత కలిగిన సంస్థలకు పునరుత్పాదక శక్తి పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ఈక్విటీ అందుబాటులో లేకపోతే స్థానిక డిస్కం ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ పథకానికి రైతులందరూ అర్హులు. ఇంత భూమి ఉండాలనే పరిమితి ఏంలేదు. రైతుల సమూహంగా ఏర్పడి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
అర్హత గల ప్రాజెక్టులు
కాంపొనెంట్ A : గ్రౌండ్ / స్టిల్ట్ మౌంటెడ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ లేదా ఇతర పునరుత్పాదక పవర్ ప్లాంట్లు 500KW నుంచి 2 MW వరకు రైతులు సొంతంగా ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు.
కాంపొనెంట్ B : డార్క్ జోన్ ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న అగ్రికల్చర్ డీజిల్ పంపుల స్థానంలో 7.5 HP వరకు సోలార్ పంపులను ఏర్పాటు చేయడం.
కాంపొనెంట్ C: కరెంట్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో సోలార్ పంపుసెట్ సామర్థ్యం 2 HP కంటే తక్కువ ఉండకూడదు. గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంపుల సోలారైజేషన్ చేస్తారు. రైతులు వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను దగ్గర్లోని సబ్ స్టేషన్ ద్వారా డిస్కంలకు అమ్ముకోవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయం
విభాగం-ఎ : విద్యుత్ సేకరణపై మొదటి ఐదేళ్ల పాటు….40 పైసలు/kWh లేదా ఏడాదికి రూ. 6.60 లక్షలు/MW ఏది తక్కువైతే అది రైతులు డిస్కమ్ లు అందిస్తాయి.
విభాగం-బి, సి : కేంద్రం 30 శాతం సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 30 శాతం, మిగిలిన 40% రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో, సిక్కిం, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్, అండమాన్ నికోబర్ దీవులలో కేంద్రం 50%, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 30%, మిగిలినది 20% రైతు పెట్టుకోవాలి. రైతులు తమ వాటాలో కొంత శాతం బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. రైతుల ఈ రుణాలను 30 ఏళ్ల లోపు తిరిగి చెల్లించవచ్చు.
చిన్న, సన్నకారు రైతులు కూడా సబ్సిడీపై సోలార్ పంపులను అమర్చుకుని తమ పొలాలకు నీరు పెట్టుకోవచ్చు. 3 నుంచి 5 హెచ్‌పీ సోలార్ పంపులను అమర్చుకునే వారికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి. ఇంతకుముందు పీఎం కుసుమ్ ద్వారా 7.5, 10 HP సోలార్ పంపులను అమర్చిన వారికి మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారు. చిన్న రైతులకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు ఖర్చులో 60 శాతం సబ్సిడీగా ఇస్తారు. రైతులు 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక రైతు సోలార్ పంప్‌ను అమర్చుకునేందుకు గరిష్టంగా రూ.2.38 లక్షల సబ్సిడీని పొందుతారు. రైతులకు రూ.45,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. పీఎం కుసుమ్ యోజన కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రైతులకు సబ్సిడీతో పాటు కొన్ని రాష్ట్రాలు రూ.45 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి.
సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థల ద్వారా సోలార్ పంపుసెట్లు ఇన్స్టలేషన్ చేస్తారు. రైతు తాను వినియోగించుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. ఇందుకు రైతులు డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.
సబ్సిడీ
- కేంద్ర ప్రభుత్వం: 30%
- రాష్ట్ర ప్రభుత్వం: 30%
- రైతు భరించేది: 40%
- ఈ పథకంలో ద్వారా వార్షిక సంపాదన- రూ. 1,00,000
- పీఎం కుసుమ్ అధికారిక వెబ్సైట్ pmkusum.mnre.gov.in
పీఎం కుసుమ్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
- రైతులు ముందుగా అధికారిక వెబ్ సైట్ pmkusum.mnre.gov.in లోకి వెళ్లాలి.
- ఈ సైట్లో స్కీమ్ వివరాలు, రాష్ట్ర వారీగా అప్లికేషన్ లింక్ లు ఉంటాయి.
- దరఖాస్తుదారులు వారి ప్రాధాన్యత మేరకు సౌరశక్తితో పనిచేసే వ్యవసాయ పంపులను ఎంచుకోవాలి.
- సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మొత్తం వివరాలు నమోదు చేయాలి. సంబంధిత పత్రాలను జోడించండి.
- రైతులు సమర్పించిన అప్లికేషన్ ను అధికారులు క్షుణ్ణంగా సమీక్షిస్తారు.
- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్