Government Hostels : బాబోయ్ ఎలుకలు.. ఆ గురుకులానికి వెళ్లబోమంటున్న విద్యార్థులు!

Best Web Hosting Provider In India 2024


దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో.. 14 మంది విద్యార్థులను ఎలుకలు కొరికాయి. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేక పోవడం వల్ల ఎలుకల బెడద ఎక్కువైంది కరెంట్‌ బోర్డులు, బాత్‌రూమ్‌లు, కిటికీలు కూడా సరిగ్గా లేవు. ఎలుకలు కరిచి విద్యార్థులకు గాయాలై అనారోగ్యానికి గురుకావడంతో.. వారిని దేవరకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.

రెండు రోజులు కావొస్తున్నా..

ఈ సంఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు. తమ పిల్లలను ఎలుకలు కరిచాయని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. గురుకులానికి చేరుకుని ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గురుకులానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం గురుకుల పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో మాట్లాడింది. సమస్యలను అడిగి తెలుసుకుంది.

ప్రభుత్వ గురుకులాల్లో ఏం జరుగుతోంది..?

‘గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న దయనీయ పరిస్థితులు ఉన్నాయి. విద్యారంగ నిర్వహణలో, అత్యవసర సమస్యలను పరిష్కరించడంలో సీఎం విఫలమయ్యారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో 38 మరణాలు జరిగాయి’ అని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలతో అసలు ప్రభుత్వ గురుకులాల్లో ఏం జరుగుతోందన్న ఆందోళన మొదలైంది.

గురుకులాల్లో విద్యార్థులు పాము, ఎలుక కాటుకు గురవుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కడం సంచలనం రేపింది. ఈ గురుకులాన్ని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు తమ గురుకులంలో ఉన్న అనేక సమస్యలను ఏకరువు పెట్టారు.

గురుకులాలను మూసేస్తారా..?

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం, బాల బాలికలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల స్థానంలో వీటికి ఆదరణ పెరిగింది. ప్రత్యేక వ్యవస్థ ద్వారా నిర్వహించిన గురుకులాల్లో విద్యార్థుల చేరికతో పాటు, మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా బాలుర, బాలికల గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యలు బయకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు.

కరీంనగర్ జిల్లాలోనూ..

కరీంనగర్ జిల్లా గురుకులాల్లో నెలకొన్న సమస్యలూ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ‘రాష్ట్రంలో గురుకులాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది’ అని కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో తిష్టవేస్తున్న సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న విమర్శలూ వస్తున్నాయి. ఈ కారణంగానే గురుకులాలను అత్యున్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌తో కలిసి.. దేవరకొండ మండలం కొండభీమన్నపల్లి బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకత్వం గురుకులంలో చోటు చేసుకున్న సంఘటనపై తీవ్రంగా స్పందించింది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

టాపిక్

NalgondaEducationStudentsTelangana NewsTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024