ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి.. మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు

Best Web Hosting Provider In India 2024


ఈ విషాద ఘ‌ట‌న ఆదివారం సాయంత్రం ప్ర‌కాశం జిల్లా పెద్దార‌వీడు మండ‌లం కొత్తప‌ల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తప‌ల్లి గ్రామానికి చెందిన కొత్త‌పల్లి విశ్వ‌రూపాచారి, భువ‌నేశ్వ‌రిల కుమారుడు శివ (11), కొత్త‌ప‌ల్లి భానుమూర్తి, సువ‌ర్ణ‌ల కుమారుడు మ‌ను (8), ఆర‌వీటి శ్రీ‌ణివాసులు, ర‌మాదేవిల కుమారుడు ఏడుకొండ‌లు (9) ముగ్గురు స్నేహితులు. ఆదివారం సెలవు దినం కావ‌డంతో ఈ ముగ్గురు మ‌రి కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ఈత కొట్ట‌డానికి అదే గ్రామంలోని పొలంలో ఓ రైతు నిటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న కుంట‌వ‌ద్ద‌కు వెళ్లారు.

ఈత కొట్టేందుకు ఆ నీటికుంట‌లో ముగ్గురూ దిగారు. అయితే వారు ఎంత‌సేప‌టికి బ‌య‌ట‌కు రాలేదు. వారు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించినప్ప‌టికీ రాలేక‌పోయారు. నీటికుంట‌లో నీరు లోతుగా ఉంది. గ‌త మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల నీరు వ‌చ్చి చేర‌డంతో నీటి కుంట పూర్తిగా నిండింది. దీంతో వారు ఒడ్డుకు చేరుకోలేక, ఊపిరాడ‌క అందులోనే మృతి చెందారు.

వీరిని కాపాడేందుకు అక్క‌డ ఎవ‌రూ పెద్ద‌వారు లేరు. అంద‌రూ చిన్నారులే. వారెవ్వ‌రికీ ఈత కూడా రాదు. దీంతో త‌మ స్నేహితుల‌ను వారు కాపాడ‌లేక‌పోయారు. ఈత‌కు నీటికుంట‌లోకి దిగిన ముగ్గురు స్నేహితులు ఇంకా రాక‌పోయేస‌రికి, మిగ‌తా చిన్నారులు గ్రామంలోకి వెళ్లి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు పొలంలోని నీటి కుంట వ‌ద్ద‌కు వచ్చి ముగ్గురుని వెలికి తీశారు. వారిని మార్కాపురం జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే వారు మృతి చెందిన‌ట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అధికారుల సందర్శన

మార్కాపురం ఇన్‌చార్జి స‌బ్ క‌లెక్ట‌ర్ వెంక‌ట సునీల్‌, డివిజనల్ పంచాయతీ అధికారి భాగ్యవతి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో రాజ్‌కుమార్‌, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని అక్క‌డ మొత్తం ప‌రిశీలించారు. అలాగే ఆసుప‌త్రికి వెళ్లి మృత దేహాల‌ను కూడా ప‌రిశీలించారు. అనంత‌రం పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రిపారు.

అలాగే కొత్త‌ప‌ల్లి ఈత‌కు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెంద‌డంపై రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌తో కొత్త‌ప‌ల్లి గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. చిన్నారుల మృత దేహాల‌ను చూసిన త‌ల్లిదండ్రులు గుండెలు ప‌గిలేలా రోధిస్తున్నారు. చిన్నారుల కుటుంబ స‌భ్యులు, బంధువులు, చిన్నారుల స్నేహితులు క‌న్నీరు మున్నీరు అయ్యారు.

-జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

టాపిక్

Crime ApCrime NewsPrakasam DistrictAp Rains

Source / Credits

Best Web Hosting Provider In India 2024