AP Floods Damage : ఏపీలో వరద నష్టం ప్రాథమిక అంచనా రూ.6882 కోట్లు-సోమవారం నుంచి మూడ్రోజుల పాటు నష్టం గణన

Best Web Hosting Provider In India 2024


AP Floods Damage : ఇటీవల భారీ వర్షాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను కొలుకోలేని దెబ్బతిశాయి. బుడమేరు గండ్లు విజయవాడ ప్రజలను నిండా ముంచాయి. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారాయి. మళ్లీ మొదటి నుంచి తమ జీవితాన్ని మొదలుపెట్టాలని ఆవేదన చెందుతున్నారు. కట్టుబట్టలు తప్ప మరేం మిగలలేదని వాపోతున్నారు. ఇళ్లు, వాహనాలు, సర్టిఫికెట్లు, ఇంట్లో సామాగ్రి, పంటలు… ఇలా సర్వస్వం కోల్పోయారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

మూడ్రోజుల పాటు నష్టం గణన

సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాలలో నష్టం అంచనా వేయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. నివాసితులు ఇంటి వద్ద అందుబాటులో ఉంటే పూర్తి స్థాయి వివరాల నమోదు అవకాశం ఉంటుందన్నారు. 32 వార్డులలో 149 సచివాలయాల పరిధిలో రెండు లక్షల నివాసాలలో నష్టం గణన చేపట్టనున్నట్లు తెలిపారు. నష్టం గణన బృందానికి ఆదివారం విజయవాడలో ఒక రోజు శిక్షణ ఇస్తామన్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్ లతో సహా పలువురి సేవలు ఉపయోగించుకుంటామని ఆర్పీ సిసోడియా తెలిపారు. ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారన్నారు. ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ల నష్టం గణన కోసం 200 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం రికార్డైందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షం పడిందన్నారు. ఏడు జిల్లాలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. కృష్ణానదికి 11.35 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయికి వరద వచ్చిందని అన్నారు. బుడమేరుకు 7 వేల నుంచి 35 వేల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో విజయవాడలో చాలా ప్రాంతాలను నీట మునిగాయన్నారు. సింగ్ నగర్ ఇంకా వరదలోనే ఉందన్నారు. ఒక యాప్ ద్వారా ఈ నెల 9 నుంచి మూడు రోజులు నష్టం అంచనాలు వేస్తామన్నారు. వరదలతో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని, వారు తొమ్మిదో తేదీన అందుబాటులో ఉండాలన్నారు. ప్రాథమికంగా రూ. 6,800 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్రానికి నివేదిక పంపించినట్లు తెలిపారు.

ఏపీలో వరదలతో రూ.6882 కోట్ల నష్టం

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందించనుంది. నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,164.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యానశాఖకు 39.9 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏపీలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి వరదల నష్టంపై అంచనా వేసింది.

సంబంధిత కథనం

టాపిక్

Vijayawada FloodsFloodsBudameruAndhra Pradesh NewsAp RainsAp GovtTrending Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024