Best Web Hosting Provider In India 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రంలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ విద్యా ర్థులు మరోసారి పోరుబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్స్ లర్ ను తొలగించి…. రెగ్యూలర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఉన్న ఇంఛార్జ్ వీసీపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయించాలని కోరుతున్నారు.
అనేక సార్లు సమస్యలపై విన్నవించిన బాసర ఐఐఐటీ విద్యార్థులు చివరికి పోరాటం తప్పదని నిర్ణయించుకున్నారు. గత నాలుగు రోజుల క్రితం హాస్టల్ భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకున్నారు. సమస్యల జాబితాను అధికారుల మందుంచారు. కానీ అధికారుల నుంచి స్పందన లేకపోవటంతో మరోసారి ఉద్యమబాట పట్టారు.
గతంలోనూ భారీ ఆందోళన…!
గత రెండేళ్ల క్రిందట ఇలాగే విద్యా ర్థులు తమ సమస్యల గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుమారు 8 వేల మంది విద్యార్థులు గతంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి, పగలు… ఎండ, వాన అని లెక్కచేయకుండా వారం రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు స్పందించేలా విద్యార్థులు ఉద్యమించారు. చివరికి అప్పటి ప్రభుత్వం దిగివచ్చింది. స్వయంగా పలుమార్లు మంత్రుల బృందం ఐఐఐటీ ప్రాంగణాన్ని సందర్శించింది. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించింది.
ప్రస్తుతం ఉన్న పలువురు అధికారుల నిర్లక్ష్యం మూలంగా యూనివర్సిటీలో చాలా సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాగా కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.
విద్యార్థుల కార్యాచరణలో భాగంగా మొదటిరోజు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2వేల మందికిపైగా విద్యార్థులు క్యాంపస్ లో ప్రధాన వీధుల గుండా ప్లకార్డులు, నినాదాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ భవనం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నినదించారు.సమస్యలు పరిష్కారం అయ్యే వరకు శాంతియుత నిరసన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యార్థుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు అధికారులు… క్యాంపస్ లో ఆంక్షలు విధించారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థుల డిమాండ్లు :
- యూనివర్సిటీలో అధికారుల మార్పు జరగాలి. స్థానికంగా ఉండే రెగ్యూలర్ వైస్ చాన్సలర్, డైరెక్టర్ ను నియమించాలి.
- ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. గత రెండేళ్లలో జరిగిన ఖర్చుల వివరాలను వెల్లడించాలి.
- మెస్ లలో భోజన నాణ్యత పెరగాలి. మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలి. పారదర్శకత పద్దతిలో మెస్ కాంట్రాక్టులను కేటాయించాలి.
- పర్మినెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ ను నియమించాలి. క్యాంపస్ లో ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాలి. వైద్య నిపుణలను నియమించాలి. ముఖ్యంగా విద్యార్థినుల కోసం లేడీ డాక్టర్ల నియామకం చేయాలి.
- ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయాలి, ఆట పరికరాలను సమకూర్చాలి. హస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలి. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపి భవిష్యత్తులో జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ నెల తమకు మోటివేషన్ క్లాస్ లు కొనసాగించాలి.
రిపోర్టింగ్ : వేణుగోపాల కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్