Hydra : జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు.. ఆ నిర్మాణాలు ఎవరివో తెలుసా?

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్‌లోని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. జయభేరి కన్‌స్ట్రక్షన్స్ సినీ నటుడు మురళీమోహన్‌కు చెందినదని సమాచారం. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది.

భారీగా పోలీస్ బందోబస్తు..

అటు శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం తీసుకుంది. దుండిగల్ మల్లంపేట కత్వ చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం ఈ విల్లాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముందే పరిశీలించిన రంగనాథ్..

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును సందర్శించారు అక్కడ జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మాణాలను పరిశీలించారు. స్థానికులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు.

మరింత విస్తరణ..

అటు హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వరకు ఉన్న హైడ్రాను.. హెచ్‌ఎండీఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి.. వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం కానున్నాయి.

ప్రత్యేక వ్యవస్థ..

హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని.. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే జరిగితే.. దేశంలోనే నాలుగో ప్రత్యేక పోలీస్ వ్యవస్థ కానుంది. తెలంగాణలో ఇప్పటికే సైబర్‌ సెక్యూరిటీ, నార్కొటిక్స్‌ విభాగాలకు రెండు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

రంగనాథ్ వస్తే అంతే సంగతి..

ఏవీ రంగనాథ్ ఏ ప్రాంతంలో పర్యటిస్తే.. ఆ ఏరియాలో కూల్చివేతలు జరగబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల రంగనాథ్ రాంనగర్ ప్రాంతంలో పర్యటించారు. ఆయన వెళ్లిన మరుసటి రోజే అక్కడ అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఆ తర్వాత దుండిగల్ వెళ్లారు. అక్కడ కూడా కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఇక గచ్చిబౌలిలో సందర్శించిన అనంతరం.. జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో రంగనాథ్ వస్తే.. ఇక అంతే సంగతి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏవీ రంగనాథ్ తర్వాత ఎక్కడికి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది.

టాపిక్

HydraHyderabadRanganath IpsGhmcHmdaTelangana NewsTs Police

Source / Credits

Best Web Hosting Provider In India 2024