Sitaram Yechury: సీతారాం ఏచూరిని ‘‘నువ్వు చాలా డేంజరస్ పర్సన్’’ అన్న జ్యోతి బసు.. ఎందుకలా అంతమాట అన్నారు?

Best Web Hosting Provider In India 2024


Sitaram Yechury: దిగ్గజ వామపక్ష నేతలు జ్యోతి బసు, సీతారాం ఏచూరిల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. పార్టీ సమావేశాల్లో, మేథో మథనాల సందర్భంలో ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపేవారు. అయితే, ఒక సందర్భంలో సీపీఎం దిగ్గజ నేత జ్యోతి బసు తనను ‘చాలా ప్రమాదకరమైన వ్యక్తి’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని 2010 లో రాసిన ఒక వ్యాసంలో సీతారాం ఏచూరి గుర్తు చేసుకున్నారు.

బహు భాషా ప్రావీణ్యత

వామపక్ష నేత సీతారాం ఏచూరికి వివిధ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఈ విషయం పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేసేది. 2010లో టెలిగ్రాఫ్ పత్రికకు రాసిన వ్యాసంలో బసు తనను ప్రమాదకరమైన వ్యక్తి అని అభివర్ణించిన విషయాన్ని ఏచూరి గుర్తు చేసుకున్నారు.

చైనా, సోవియట్ యూనియన్ పర్యటనలో..

వామపక్ష నేతలు 80వ దశకం చివరలో, 90 ల ప్రారంభంలో సోవియట్ యూనియన్ లో, చైనాలో పర్యటించారు. చైనా అభివృద్ధి నమూనాలను అర్థం చేసుకోవడంతో పాటు “సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి దారితీసిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి వారు ఆ పర్యటన చేపట్టారు. ఆ పర్యటనలో నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఇఎంఎస్ నంబూద్రిపాద్, సీతారాం ఏచూరి, ఎం బసవపున్నయ్య, హరి కిషన్ సింగ్ సుర్జీత్, జ్యోతిబసు తదితరులు ఉన్నారు.

ఎవరి భాషలో వారితో..

వారితో మాట్లాడుతున్న సమయంలో సీతారాం ఏచూరి వారి వారి మాతృభాషల్లో మాట్లాడడం జ్యోతి బసును విస్మయానికి గురి చేసింది. హరి కిషన్ సింగ్ సుర్జీత్ తో హిందీలో, బసవపున్నయ్య తో తెలుగులో, జ్యోతిబసుతో బెంగాలీలో, ఇఎంఎస్ నంబూద్రిపాద్ తో తమిళంలో ఏచూరి మాట్లాడసాగారు. ఇదంతా గమనిస్తున్న జ్యోతి బసు ఏచూరితో ‘‘నువ్వు మాతో మా మా మాతృ భాషల్లో మాట్లాడుతున్నావు. ఎవరికి ఏం చెబుతున్నావో అర్థం కావడం లేదు. నువ్వు చాలా డేంజరస్ పర్సన్ గా ఉన్నావు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. 2010 లో రాసిన వ్యాసంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న సీతారాం ఏచూరి.. జ్యోతిబసులో సున్నితమైన హాస్య చతురత ఉండేదన్నారు.

జేఎన్యూ స్టుడెంట్

1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన ఏచూరి (Sitaram Yechury) హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివిన ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం జేఎన్ యూ (JNU)లో చేరారు. తెలివైన విద్యార్థి అయిన అతను ఆర్థికశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలలో మొదటి తరగతి సాధించాడు. జేఎన్యూ విద్యార్థి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి మృతదేహం

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఏచూరి పరిస్థితి విషమంగా ఉండడంతో రెస్పిరేటరీ సపోర్ట్ పై ఉన్నారు. పార్టీలకతీతంగా రాజకీయ సంబంధాలున్న సౌమ్యుడైన సీతారాం ఏచూరి దేశంలోని ప్రముఖ వామపక్ష నాయకుల్లో ఒకరు. ఆయన ఆకాంక్ష మేరకు, తన మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించకుండా, వైద్య పరిశోధనలకు ఉపయోగపడేలా డిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కు ఇచ్చారు.

Best Web Hosting Provider In India 2024



Source link