Palm oil crop : మెదక్ నేలలు పామాయిల్ సాగుకు అనుకూలమైనవి: శాస్త్రవేత్తలు

Best Web Hosting Provider In India 2024


మెదక్ జిల్లాలోని నేలలు పామాయిల్ సాగుకు ఎంతో అనుకూలమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఉన్న పామాయిల్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు.. జిల్లాను సందర్శించి ఈ విషయం చెప్పారు. మెదక్ పట్టణంలోని నస్కెట్ ఏరియాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. పామాయిల్ మొక్కలు నాటారు.

2024-25 సంవత్సరానికి మెదక్ జిల్లాలో 2 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయించేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఇప్పటివరకు 1176 ఎకరాల్లో పామాయిల్ సాగుకు రైతులు ముందుకొచ్చారు. ఇప్పటివరకు 25 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు నాటినట్టు అధికారులు వివరించారు.

మెదక్‌లో ఫ్యాక్టరీ..

2023 -24 సంవత్సరంలో మెదక్ జిల్లాలో పామాయిల్ సాగు కోసం.. రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు, దిగుబడిని కొనుగోలు చేసి నూనె ఉత్పత్తి చేసేందుకు లివింగ్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 25 ద్వారా అనుమతులు ఇచ్చింది. లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు.. మొక్కలు ఉత్పత్తి చేయడం కోసం నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో 43 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించారు.

336 ఎకరాల్లో…

మెదక్ జిల్లాలో 2023- 24 సంవత్సరంలో 74 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారని అధికారులు వివరించారు. ప్రభుత్వం ద్వారా 336 ఎకరాలకు సంబంధించి 13 లక్షల రూపాయల సబ్సిడీని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల్లో డ్రిప్ పరికరాలపై 90 శాతం రాయితీ సదుపాయం కల్పిస్తున్నారు. ఒక ఎకరానికి ఆయిల్ ఫామ్ మొక్కలకు రూ.9,650 మొదటి సంవత్సరం సబ్సిడీ ఇవ్వడంతో పాటు.. అంతర్ పంటల సాగు కోసం మొదటి , రెండవ, మూడవ, నాలుగవ సంవత్సరాలకు గాను రూ.26,450 సబ్సిడీ ఇస్తున్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం తర్వాత నిరంతర దిగుబడి వస్తుంది. 10 నుంచి 12 టన్నులు దిగుబడి సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్ ఫామ్ ధర రూ.14,500 ఉంది.

ప్రతి 20 కిలోమీటర్లకు కొనుగోలు కేంద్రం..

రైతులు తాము పండించిన ఆయిల్ ఫామ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ వారు గెలలను కొనుగోలు చేసిన తర్వాత.. 14 రోజుల్లోపు రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. పామాయిల్ సాగు ద్వారా అధిక దిగుబడులు, అధిక లాభం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వివరాల కోసం జిల్లా ఉద్యానాధికారి (8977714423), నర్సాపూర్ ఉద్యానాధికారి (8977714422) ని సంప్రదించాలని సూచించారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

టాపిక్

MedakHorticulture CropsTelangana NewsTrending TelanganaFarmers

Source / Credits

Best Web Hosting Provider In India 2024