Vande Bharat Express : రామగుండంకు వందే భారత్ – 3 గంటల్లోనే హైదరాబాద్ కు చేరుకోవచ్చు…!

Best Web Hosting Provider In India 2024


దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా వందేభారత్ ప్రసిద్ధి చెందింది. ఈ సర్వీసు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అందుబాటులోకి రానుంది. ఇకపై రామగుండం నుంచి సికింద్రాబాద్ కు కేవలం మూడు గంటల్లోనే చేరు కోవచ్చు. తెలంగాణలో ఈ సర్వీసుకు కేవలం రామగుండం, ఖాజీపేటలో మాత్రమే హాల్టింగ్ కల్పించారు. 

ప్రతీరోజూ ఉదయం 5గంటలకు నాగ్ పూర్ లో (ట్రైన్ నంబరు 20101) బయల్దేరుతుంది. రామగుండంలో ఉదయం 9.15 గంటలకు చేరుతుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.15 గంటలకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 1గంట కు సికింద్రాబాద్ నుంచి (ట్రైన్ నెం. 20102) బయల్దేరి.. రామగుండానికి మధ్యా హ్నం 3.15 గంటలకు చేరుకుంటుంది. 20 కోచ్ లు ఉండే ఈ రైలు సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలు అందించనుంది.

130 కిలోమీటర్ల వేగంతో…

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ రైలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తోంది. ఈనెల 16 సోమవారం నుంచి నాగ్ పూర్ సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు సేవలు మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వందేభారత్ సేవలు రెండురూట్లలోనే ఉన్నాయి. 

మొదటిది విశాఖపట్నం- సికింద్రాబాద్ కాగా, రెండోది కాచిగూడ- తిరుపతి సర్వీసులు. ఇవి రెండు దక్షిణ మధ్యరైల్వేకు కేటాయించారు. తాజా సర్వీసు సెంట్రల్ రైల్వే కేటాయించిన నాగ్ పూర్ డివిజన్ కు చెందినది. సోమవారం ఉదయం ప్రధాని ఈ రైలుకు పచ్చజెండా ఊపగానే.. నాగ్పూర్ నుంచి బయల్దేరుతుంది. ప్రారంభోత్సవ రైలు కావడంతో రామగుండం కు రాత్రి 8.30గంటలకు చేరుకుంటుంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ కూర్ మక్కాన్ సింగ్ స్వాగతం పలుకుతారు.

వందేభారత్ సేవలకు ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉంది. దీని టికెట్ ఖర్చు అధికంగా ఉన్నా.. వేగంగా వెళ్లాలనుకున్న వారంతా దీన్నే ఎంచుకుంటున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించి కేవలం రామగుండంలో మాత్రమే హాల్టింగ్ కల్పించారు.

రామగుండం ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల వాసులకు అంత సౌకర్యం కాదు. పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లకు రోడ్ కనెక్టివిటీ బాగున్న నేపథ్యంలో ‘ఈ స్టేషన్లలోనూ హాల్టింగ్ ఇవ్వాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో కాగజ్ నగర్, మంచిర్యాలతో పాటు పెద్దపల్లి, జమ్మికుంట లో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించాలనే డిమాండ్ ఉంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు నాగపూర్ తో వ్యాపార పరమైన సంబంధాలున్నాయి. వ్యవసాయోత్పత్తుల విక్రయానికి పెద్ద మార్కెట్ గా పేరొందిన నాగపూర్ కు ఉమ్మడి జిల్లా వ్యాపారులు నిత్యం వెళ్తుంటారు. వందేభారత్ ద్వారా కేవలం నాలుగు గంటల్లోనే నాగపూర్ కు చేరుకునే అవకాశముంది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంతోపాటు పెద్దపల్లి జమ్మికుంట లో హాల్టింగ్ కల్పిస్తే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి బల్లార్షాల మధ్య కేవలం 14 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పటికీ రెండు చోట్ల హాల్టింగ్ కల్పించారు. రామగుండం, పెద్దపల్లిల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉన్నా పెద్దపల్లిలో హాల్టింగ్ కల్పించలేదు. స్థానిక నాయకుల చొరవ తీసుకోకపోవడంతోనే హాల్టింగ్ రాలేదనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లిలో రైలు నిలిచేలా ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయరామారావు చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఖాజీపేట-బల్లార్షా మధ్య 130 కి.మీతో…

ఈ రైలు మూడు డివిజన్లలోని పలు సెక్షన్లలో సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట- బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో వెళ్తుంది. పెద్దపల్లి-కరీంనగర్ 100 కి.మీ, కరీంనగర్ జగిత్యాల (లింగం పేట) 90 కి.మీ. వేగంతో వెళ్లేలా ట్రాక్లు ఇటీవల అప్ గ్రేడ్ చేశారు. అతి తక్కువగా మల్కాజిగిరి- మౌలాలి సెక్షన్లలో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. 

వేగంపై లైన్ అప్ డేషన్ తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బల్లార్షా- ఖాజీపేట సెక్షన్లో 110 కి.మీల వేగంతో వెళ్తుందని అధికారులు తెలిపారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

టాపిక్

KarimnagarKarimnagar Lok Sabha ConstituencyTelangana NewsVande Bharat ExpressRailwaySouth Central RailwayHyderabadRamagundam

Source / Credits

Best Web Hosting Provider In India 2024