AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

Best Web Hosting Provider In India 2024


AP e-crop Booking : ప్రకృతి వైపరీత్యాలలో మొదటిగా నష్టపోయేది రైతులే. వర్షాలు, వరదలు, ఎండలు, వివిధ వాతావరణ పరిస్థితులతో అన్నదాతకు ఆరుగాలం కష్టమే. అయితే రైతన్నల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు బీమా పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుండగా, వివిధ రాష్ట్రాలు ఈ పథకానికే సొంత పేర్లు పెట్టుకుని అమలు చేస్తున్నాయి. ఈ పథకంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటల కోసం 2%, రబీ పంటల కోసం 1.5%, వార్షిక వాణిజ్య పంటల కోసం 5% రైతులు చెల్లించాలి. అయితే రైతులపై భారం పడకుండా ఈ ప్రీమియంలను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తుంటాయి.

ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత పంటల బీమాను అమలు చేస్తుంది. ఈ రెండు బీమా పథకాలు ఖరీఫ్‌ పంటకాలానికి జిల్లాలవారీగా ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా కల్పిస్తారు. రబీ పంటలకు మాత్రం రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5%, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% చొప్పున బీమా ప్రీమియం చెల్లించాలి.

ఈ-పంట నమోదు గడువు పెంపు

ఏపీలో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, ఇలా అనేక రకాల పంటలు పండిస్తుంటారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వమే బీమా చెల్లిస్తుంది. పంట నష్టం వాటిల్లితే ఇన్ పుట్ సబ్సిడీ కింద రైతులకు పరిహారం అందిస్తారు. ఈ పరిహారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పంటలకు బీమా చేయిస్తే పంట నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా చెల్లించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. ముందుగా రైతులకు ఖరీఫ్, రబీ సీజన్ లో పంట నమోదుకు అవకాశం కల్పి్స్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-పంట నమోదు గడువు ఇచ్చారు. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచారు.

ఈ-పంట నమోదుకు ప్రభుత్వం ఓ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి రైతుల పంటలను ఈ-పంట పోర్టల్ లో నమోదు చేస్తారు. రైతుల తమ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, పొలం సర్వే నెంబర్, ఏ పంట వేశారో వ్యవసాయ అధికారికి తెలియజేస్తే వారు పంట పొలం వద్దకు వచ్చి తనిఖీ చేసి అక్కడే రైతు వివరాలు నమోదు చేస్తారు. అనంతరం ఫొటో తీసి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. అలా నమోదైన పంటలకు ప్రభుత్వం బీమా కల్పిస్తుంది. ఇప్పటికే గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటల ఆన్‌లైన్ నమోదు సాగుతోంది. ఇలా ఈ క్రాప్ లో పంటలు నమోదును బట్టి రైతులకు అవసరమైన ఎరువులు, పరుగుల మందులు, విత్తనాలను ప్రభుత్వం అందిస్తుంది.

ఈ-క్రాప్ వల్ల ప్రయోజనాలు

వ్యవసాయ అధికారులు జియో ఫెన్సింగ్‌ విధానం ద్వారా పొలం వద్ద రైతును ఉంచి, ఫొటో తీసి ఈ-క్రాప్ యాప్‌లో వారి వివరాలు నమోదు చేస్తారు. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పొలం సర్వే నెంబర్‌ వివరాలు నమోదు చేసి రైతు వేలిముద్రలు తీసుకుని ఈ-కేవైసీ చేస్తారు. అనంతరం రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి అవసరమైన ఈ-కేవైసీ పత్రాలను అందించాలి. సెప్టెంబర్ 30లోగా ఈ-పంట, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన పంటలకు ఉచిత బీమా వర్తిస్తుంది. రైతులు ఈ-కేవైసీ చేయించుకోకపోతే పలు సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం తక్కువ. ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు వడ్డీలేని పంట రుణాలు పొందవచ్చు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోవచ్చు. ఈ-క్రాప్ వల్ల ఇలాంటి అవకాశాలు ఉంటాయి.

సంబంధిత కథనం

టాపిక్

FarmersCrop LossCrop LoansHorticulture CropsInsuranceAndhra Pradesh News

Source / Credits

Best Web Hosting Provider In India 2024