Dy CM Bhatti Vikramarka : రూ.2 లక్షలకు పైగా రుణాలు మాఫీపై ఆలోచన, డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024


Dy CM Bhatti Vikramarka : ‘బాధ్యత గల శాసనసభ్యులు బజార్ న పడి తన్నుకోవడం బాధ కలిగిస్తుంది…ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించాం…వాళ్లు అలానే రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వ ఏం చేయాలో చేస్తుంది’ అని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారు… వాళ్ల మాదిరిగా మేము ప్రవర్తించడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత గొంతు వినిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము ప్రవర్తించబోమని పెద్దపల్లి జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలంలో పలు కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న భట్టి విక్రమార్క నందిమేడారం పంప్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అంటే మాకు గౌరవం ఉందన్నారు.‌ అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో… ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారని తెలిపారు. శాంతిభద్రతలు కాపాడడంలో మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థ రహితమన్నారు. బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.

విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శం

విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ వంశీకృష్ణతో కలిసి ధర్మారం మండలం నందిమేడారం, కటికనపల్లి గ్రామాల్లో రెండు 33/11 కేవి సబ్ స్టేషన్ ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డు లో ధర్మారం, వెల్గటూరు, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పాలకులు సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి ఉండే విద్యుత్ డిమాండ్ ను అంచనా వేస్తూ దాని సాధన దిశగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్ స్టోరేజ్ ఎనర్జీ మొదలగు రంగాలలో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

త్వరలో సోలార్ పంపు సెట్లు

పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాలలోని రైతుల మోటార్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు పంటలతో పాటు విద్యుత్తుతో కూడా ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విప్ అభ్యర్థన మేరకు మేడారం గ్రామంలో పూర్తి స్థాయిలో రైతులకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే కొన్ని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పవర్ అంశంలో దేశానికి తెలంగాణను మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకొని రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు.

రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలు మాఫీ చేసే ఆలోచన

రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు పంటరుణాలను మాఫీ చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలకు పైగా రుణమాఫీపై ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ రెండు లక్షలకు పైగా ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ కింద అతి తక్కువ సమయంలో రూ.18 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. పంటల బీమా పథకం కింద రైతుల పక్షాన ప్రీమియం ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

ఎల్లంపల్లి భూ నిర్వాసతులకు రూ.18 కోట్ల పరిహారం అందజేత

దశాబ్ది కాలం పైగా పెండింగ్ లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితులకు 18 కోట్ల రూపాయల పరిహారం చెక్కులను అందజేశారు. పదేళ్లుగా పరిష్కారం కాని సమస్య పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పరిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు భట్టి విక్రమార్క. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న భూసేకరణ నిధులను చెల్లించడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి అమెరికా, కొరియా దేశాలలో పర్యటించి దాదాపు రూ.36 వేల కోట్ల పెట్టుబడుల ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో సమీకృత గురుకుల భువన నిర్మాణాన్ని త్వరలో మంజూరు చేస్తామని అన్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం

టాపిక్

FarmersCrop LoansGovernment Of TelanganaCm Revanth ReddyMallu Bhatti VikramarkaKarimnagar

Source / Credits

Best Web Hosting Provider In India 2024