Best Web Hosting Provider In India 2024
Visakha Movie Locations: మనదేశంలోని అందమైన నగరాలలో విశాఖపట్నం ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత కచ్చితంగా చూడదగ్గ సిటీ విశాఖనే. విశాఖపట్నానికి ఎక్కువ మంది బీచ్ కోసమే వస్తారు. సముద్రపు అలల తాకిడిని అనుభవించేందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ వెంబడి సందడి చేస్తారు. కేవలం బీచ్ మాత్రమే కాదు ఎన్నో అందమైన ప్రదేశాలు వైజాగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో వైజాగ్ అందాలను చూపించారు. కానీ మీకు ఆ లొకేషన్‌లు విశాఖపట్నంలోవని ఎక్కువ మందికి తెలియదు. ఇక్కడ ఎన్ని సినిమాలు షూటింగ్ చేశారో, ఏఏ సినిమాలు ఏ ఏ ప్రదేశాల్లో చిత్రీకరించారో తెలుసుకుందాం. ఈ ప్రదేశాలన్నీ కూడా చూడదగ్గవే.
పచ్చని అటవీ ప్రాంతాలు కావాల్సి వస్తే అరకు, పాడేరు ప్రాంతాలకు సినిమా డైరెక్టర్లు వచ్చేస్తారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్‌లోని ఎన్నో సినిమాలు ఈ పచ్చని అటవీ ప్రాంతాల మధ్య చిత్రీకరించారు. హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన షూటింగ్స్ స్పాట్ విశాఖపట్నం.
భీమిలి
భీమిలిలో సముద్రం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ పూర్వం నుంచి ఎన్నో సినిమాలను చిత్రీకరించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరోచరిత్ర సినిమా. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన సినిమాను భీమిలి బీచ్ లోనే ఎక్కువగా షూటింగ్ చేశారు. భీమిలి దగ్గర ఉన్న గాలి మేడలో మరోచరిత్ర క్లైమాక్స్ ను చిత్రీకరించారు. అక్కడ ఉన్న ఎర్ర మట్టి దెబ్బలు ఎన్నో సినిమాల్లో కనిపిస్తాయి. స్వర్ణకమలం, శ్రీవారికి ప్రేమలేఖ వంటి సినిమాల్లో ఎన్నో సీన్లు భీమిలిలోనే చిత్రీకరించారు.
కైలాసగిరి
శివుడు కొలువై ఉన్న కైలాసగిరి ఎంతో అందమైన ఆలయాల్లో ఒకటి. ఇది మంచి షూటింగ్ స్పాట్. కొండమీద ఉండే ఈ కైలాసగిరిని చూసేందుకు ఎంతోమంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఆ కొండ మీద నుంచి చూస్తే బీచ్ అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే కైలాసగిరిలో ఎన్నో సినిమాలను చిత్రీకరించారు. సరిలేరు నీకెవ్వరూ, బిల్లా, సోలో బతికే సో బెటర్ వంటి సినిమాల్లో ఈ కైలాసగిరిని చూడవచ్చు.
ఆర్కే బీచ్
వైజాగ్ అంటే గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ప్రతిరోజు ఆర్కే బీచ్‌లో వందల మంది కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ ఎన్నో సినిమాలు, షూటింగ్‌లు అయ్యాయి. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అలాగే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఓయ్, పాగల్ వంటి సినిమాల్లో కూడా ఆర్కే బీచ్ అందాలను చూడవచ్చు. ప్రస్తుతం బీచ్ సీన్లు కావాలంటే ఆర్కే బీచ్‌కే దర్శక నిర్మాతలు వస్తున్నారు.
ఫిషింగ్ హార్బర్
వైజాగ్‌లో ఫిషింగ్ హార్బర్ ఎంతో ప్రత్యేకమైన ప్రాంతం. పడవలతో నిండి ఉండే ఈ ప్రాంతం మత్స్యకారుల బ్యాక్ గ్రౌండ్ లో ఉండే సినిమాలకు ఊపిరి పోస్తుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఈ ఫిషింగ్ హార్బర్లో చిత్రీకరించారు. అలాగే సింగం 3, హిట్ సెకండ్ కేస్, మజిలీ వంటి సినిమాల్లోనూ విశాఖ ఫిషింగ్ హార్బర్ కనిపిస్తుంది. భారతీయుడు 2 లో కూడా కొన్ని సీన్లను ఈ ఫిషింగ్ హార్బర్ లో చిత్రీకరించారు.
విశాఖపట్నం పోర్టు
విశాఖ పట్నం పోర్టు అనగానే అందరికీ యాక్షన్ సీన్లే గుర్తొస్తాయి. ఇక్కడ ఎన్నో ఫైటింగ్ సీన్లను చిత్రీకరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లు అధికంగా ఇక్కడే చిత్రీకరణ జరిగాయి. భోళాశంకర్, చత్రపతి సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఫైటింగ్ సీన్లను విశాఖపట్నం పోర్టులోనే చిత్రీకరించారు. జులాయి సినిమాలో చివరి క్లైమాక్స్ సీను కూడా వైజాగ్ లోనే షూటింగ్ జరిగింది. ఇక్కడ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉండే రంగు రంగుల కంటైనర్లు షూటింగ్‌కు అనువుగా ఉంటాయి.
పైన చెప్పిన ప్రాంతాలన్నీ విశాఖలో ఎంతో ప్రముఖమైనవి. వైజాగ్ వచ్చేటప్పుడు కచ్చితంగా చూడాల్సిన వాటిలో పైన చెప్పిన ప్రాంతాలను కూడా కలుపుకోండి. వీటిని చూస్తే రెండు రోజులు సమయం పట్టేస్తుంది.
టాపిక్