Best Web Hosting Provider In India 2024
హైదరాబాద్ స్టేట్‌ను పాలించిన నిజాం రాజులు.. ఎన్నో మంచి పనులు చేశారు. ఇది నాణేనికి ఒకవైపు. కానీ.. మరో కోణం అత్యంత భయంకరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లను అడ్డంపెట్టుకొని.. నిజాం పాలకులు చేసిన అరాచకాలు తెలంగాణలో రక్త చరిత్ర రాశాయి. ఆ చరిత్రలో ఓలుగల్లుకు ప్రత్యేక పేజీలు ఉన్నాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా ఆనాటి అరాచకాన్ని కళ్లారా చూసిన వారు చెబుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఓరుగల్లు వీరులు చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ వీరుల చరిత్రను పదిలంగా ఉంచాలని కోరుతున్నారు.
భగ్గుమన్న ఓరుగల్లు..
నిజాం పాలనలో పేదల భూములను లాక్కొని దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లు పెత్తనం చెలాయించేవారు. వారి అరాచకాలపై భగ్గుమన్న ఓరుగల్లు ప్రజలు తిరగబడ్డారు. సాయుధ పోరాటానికి తిలకం దిద్దారు. దేవరుప్పుల మండలం కడవెండి మొదలు.. దుగ్గొండి మండలం తిమ్మంపేట వరకు.. పల్లెలు రోకలిబండలు ఎత్తాయి. అక్కాచెల్లెల్లు కారంపొడితో కదిలారు. రజాకార్లను తరిమారు. ఈ సాయుధ పోరాటంలో ఎందరో వీరులు అమరులయ్యారు. వారికి ఓరుగల్లు వందనం చేస్తోంది.
దొరసానికి శిస్తు..
దేశానికి స్వాతంత్ర్యం రాకముందు.. 1944లో భువనగిరిలో ఆంధ్రమహాసభ సమావేశంతో దేవరుప్పుల మండలం కడవెండి ప్రజలు చైతన్యం పొందారు. గ్రామ రక్షణ దళంగా ఏర్పడి దొరల పాలనను వ్యతిరేకించారు. విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసానికి శిస్తు చెల్లించకుండా ఆ రక్షణ దళం అడ్డుకుంది. ఇంటిని స్థావరంగా మార్చుకుని దొరసాని ఆగడాలను ఎండగట్టింది. అప్పుడు రజాకార్లు కాల్పులు జరపడంతో.. దొడ్డి కొమురయ్య అమరుడయ్యారు. గొడ్డలెత్తిన దొడ్డి కొమురయ్య రక్తంతో తడిసిన నేలలో.. రైతాంగ సాయుధ పోరాట బీజాలు మొలకెత్తాయి. ఇదే మండలం కామారెడ్డిగూడేనికి చెందిన షేక్ బందగీ దొరల పాలనను వ్యతిరేకించి.. విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిపై పోరాడి అమరుడయ్యాడు.
బతికుండగానే తగలబెట్టారు..
పర్వతగిరి మండలంలోని కొంకపాక, చౌటపల్లి గ్రామాల్లో రజాకారు మూకల దాడిలో 47 మంది వీర మరణం పొందారు. వారి జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబర్ 17న కొంకపాక గ్రామస్థులు అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. 1948 మార్చి 15న నల్లబెల్లి మీదుగా గుర్రాలపై వచ్చిన రజాకార్లు.. కొంకపాకలో 15 మంది, చౌటపల్లి గ్రామంలో 32 మందిని దారుణంగా హత్య చేశారు. గుర్రాలతో తొక్కించి ప్రాణాలు ఉండగానే గడ్డి మోపులు వేసి నిప్పంటించి హత్య చేశారు. మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు కొంకపాక పంచాయతీ కార్యాలయం ఆవరణంలో.. 1994 జనవరి 27న అమరులైన వారి పేర్లతో ఉన్న స్తూపాన్ని నిర్మించారు.
పరకాల గడ్డ..
పరకాల గడ్డ.. పోరాటాలకు పుట్టినిల్లు. 1947 సెప్టెంబరు 2న జరిగిన క్రూరమైన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని ఒకే చెట్టుకు కట్టేసి రజాకార్లు కాల్చి చంపారు. వారి జ్ఞాపకార్థమే ఇప్పుడు పరకాల నడిబొడ్డున ఉన్న అమరవీరుల స్మారక స్తూపం. నర్సంపేట సమీపంలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట ప్రజలు బందూకులు చేతబూని నిజాంపై తిరుగుబాటుకు బండరాళ్లతో పునాది వేశారు. గ్రామంలో రక్షణ బురుజు నిర్మించుకుని.. రజాకార్లు, నిజాం సైన్యం, దొరలు, దేశ్‌ముఖ్‌ల అనుచరులపై దాడి చేశారు. రజాకార్లను ప్రతిఘటించిన గొల్ల కనకయ్య, కత్తి సాంబయ్య, గొల్ల బక్కయ్య, బాషబోయిన నర్సయ్యలను పట్టుకుని పాకాల అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారు.
చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం..
తెలంగాణ పోరాటాల్లో.. చాకలి ఐలమ్మ పాత్ర మాటల్లో చెప్పలేనిది.. రాతల్లో రాయలేదని. విస్నూరు దొర అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ.. పేదలకు వేల ఎకరాలను పంచి పెట్టారు. 1985 సెప్టెంబరు 10న కన్నుమూశారు. ఆమె పోరాటానికి గుర్తుగా పాలకుర్తి రాజీవ్‌చౌరస్తాలో కాంస్య విగ్రహంతోపాటు ఓ స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గుత్పలు చేతపట్టి రజాకార్లను తరిమికొట్టడంలో.. తమ్మడపల్లి ఆదర్శంగా నిలిచింది. పోరాట యోధుడు నల్ల నర్సింహులు నాయకత్వంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. తెల్లవారితే ఉగాది పండగ అనగా అర్ధరాత్రి నిజాం సైన్యం మూకుమ్మడిగా గ్రామంలోకి చొరబడి.. దొంతూరి చిన్న నర్సయ్య, దుబ్యాల చిన్ననర్సయ్య, బత్తిని బక్కరాజయ్య, చాడ అనంతరెడ్డి, గంట్లకుంట షాపుకారి, కుంట సోమయ్య, దూదేకుల చిన్న ఖాసీం, చిన్న నాసర్, దిడ్డి పేరుమయ్య, పెద్ద నాసర్‌తోపాటు మరో ముగ్గురిని అతి దారుణంగా చంపేశారు.
టాపిక్