Challa Mirapakayalu: పెరుగన్నం, పప్పన్నంతో మజ్జిగ మిరపకాయలు తింటే ఆ రుచే వేరు, వీటిని ఇంట్లో ఇలా సులువుగా చేేసేయచ్చు

Best Web Hosting Provider In India 2024


Challa Mirapakayalu: చల్ల మిరపకాయలనే మజ్జిగ మిరపకాయలు కూడా అంటారు. వీటిని నూనెలో వేయించి పెరుగన్నం, పప్పు అన్నం, సాంబార్ తో తింటే జోడి అదిరిపోతుంది. గ్రామాల్లో ఇప్పటికీ వీటిని చేసుకుని తినే వారి సంఖ్య ఎక్కువే. అయితే పట్టణాల్లో మాత్రం ఆధునిక యువతకు దీని రెసిపీలు తెలియక సూపర్ మార్కెట్లలో కొనుక్కుంటున్నారు. సూపర్ మార్కెట్లలో కొనే వాటిలో ఉప్పు అధికంగా వేస్తున్నారు. అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్న ఉద్దేశంతో ఉప్పు శాతాన్ని పెంచుతున్నారు. వాటిని తినడం వల్ల బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే మీరు వీటిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.

చల్ల మిరపకాయలు రెసిపీకి కావలసిన పదార్థాలు

పొడవుగా ఉండే పచ్చిమిర్చి – కిలో

ఉప్పు – 200 గ్రాములు

పెరుగు – ఒక లీటరు

చల్ల మిరపకాయలు రెసిపీ

1. వేసవిలోనే చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు వండుకోవడం మంచిది.

2. ఎందుకంటే వీటిని ఎర్రటి ఎండలో మూడు నాలుగు రోజులు ఎండ పెట్టాల్సి వస్తుంది.

3. అప్పుడే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎండుతాయి.

4. కాబట్టి వేసవిలోనే వీటిని ప్లాన్ చేసుకోండి.

5. పచ్చిమిరపకాయలను కాడలతో పాటు నీటిలో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టండి.

6. ఫ్యాన్ కింద ఆరబెడితే రెండు మూడు గంటల్లో ఆరిపోతాయి.

7. ఇప్పుడు మిరపకాయలను మధ్యలో నిలువుగా కోసుకోండి.

8. ఒక గిన్నెలో పెరుగు వేసి మజ్జిగ లాగా బాగా గిలక్కొట్టండి.

9. అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి.

10. ఇప్పుడు కట్ చేసిన మిరపకాయలను అందులో వేసి రెండు మూడు రోజులు ఊరనివ్వండి.

11. అలా మూడు రోజులు నానబెట్టాక మూత తీస్తే పుల్లని వాసన వస్తూ ఉంటుంది.

12. ఆ సమయంలో ఎర్రటి ఎండ తగిలేచోట ఒక్కొక్క మిరపకాయని తీసి ఎండబెట్టండి.

13. ఆ పులిసిన మజ్జిగను మాత్రం అలానే ఉంచండి. సాయంత్రం అయ్యేసరికి అవి కాస్త ఎండుతాయి.

14. మళ్లీ వాటిని మజ్జిగలో వేసి రాత్రంతా ఉంచండి.

15. ఉదయం అయ్యే సరికి ఎర్రటి ఎండలో ఎండబెట్టండి. ఇలా రెండు మూడు సార్లు చేశాక ఆ మజ్జిగను పడేయవచ్చు.

16. పచ్చిమిర్చిని మాత్రం ఎండలో బాగా ఎండబెట్టాలి.

17. అవి గిన్నెలో వేస్తే గలగలాడేలా సౌండ్ రావాలి.

18. అంతవరకు ఎండబెట్టి గాలి తగలని డబ్బాలో వేసి భద్రపరచుకోండి. ఇవి ఆరు నెలలైనా తాజాగా ఉంటాయి.

చల్ల మిరపకాయలను తినే పద్ధతి ఈనాటిది కాదు. ప్రాచీన భారతదేశంలోనే దీన్ని కనిపెట్టారు. ఇలా పులిసిన ఆహారాన్ని తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ఎన్నో అధ్యయనాలు కూడా చెప్పాయి. ఒకసారి వీటిని ప్రయత్నించి చూడండి మీరు చాలా సులువుగా చేయగలరు.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024