Best Web Hosting Provider In India 2024
చిన్న పిల్లలకు ప్రతిదీ నేర్పించాల్సి బాధ్యత తల్లిదండ్రులదే. తినడం దగ్గర నుంచి నిద్రపోయే దాకా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారి పనులు వారికి చేసుకోవడం వచ్చే వరకు వారికి అన్ని విషయాల్లో సాయం చేయాలి. కూర్చోవడం వచ్చిన పిల్లలు ముఖ్యంగా ఏడాది నుంచి మూడేళ్ల వయసులోపు పిల్లలు ఫోటోలో చూపించినట్టు ఆంగ్ల అక్షరం W పొజిషన్లో కాళ్లు ముడుచుకుని కూర్చోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. దీన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేసి ఉంటారు. నిజానిక అలా కూర్చోవడం పిల్లలకు మేలు చేయదు.
పిల్లలు అలా కూర్చోవడం వల్ల వారికి మంచి అనుభూతి కలుగుతుంది. తమ మోకాళ్ళను వంచి పాదాలను వెనక్కి పెట్టి కూర్చుంటారు. దీని వల్ల W ఆకారంలో కాళ్లు కనిపిస్తాయి. కానీ ఎక్కువసేపు ఇలా కూర్చునే అలవాటు వారికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. డాక్టర్ అర్పిత్ గుప్తా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు. పిల్లలు W పొజిషన్ లో కూర్చోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు.
పిల్లలు W పొజిషన్లో కూర్చోకూడదు
తొడ ఎముక… తుంటి ఎముక (కటి) సాకెట్ నుండి పొడుచుకు వచ్చినప్పుడు హిప్ తన స్థానాన్ని మార్చుకుంటుంది. పిల్లలు W పొజిషన్ లో కూర్చోవడం వల్ల తుంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇలా కూర్చునే పిల్లలు ఇతర పిల్లల మాదిరిగా వారి కండరాలను ఉపయోగించరు. దీని వల్ల వారి తొడ కండరాలు బలహీనపడతాయి.
బాడీ మూవ్ మెంట్ తగ్గుతుంది
పిల్లల W పొజిషన్ లో కూర్చోవడం వల్ల అతని క్రాస్ బాడీ మూవ్ మెంట్ పరిమితం అవుతుంది. ఈ కారణంగా పిల్లవాడు తన రెండు చేతులను ఉపయోగించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే W పొజిషన్ లో, పిల్లవాడు తన రెండు చేతులను సౌకర్యవంతంగా ఉపయోగించగలుగుతాడు. కానీ కాళ్లను, నడుము కింద భాగాన్ని కదపలేడు.
ఒక పిల్లవాడు ఇప్పటికే కండరాల బిగుతు లేదా హైపర్టోనియాకు గురైతే, W పొజిషన్లో కూర్చోవడం వల్ల పిరుదులు, మోకాలు, చీలమండలలో బిగుతుగా పట్టేసే సమస్య పెరుగుతుంది. కండరాలు బిగుసుకుపోవడం లేదా బిగుతుగా అనిపించడం జరుగుతుంది.
W పొజిషన్లో కూర్చున్న పిల్లవాడిని తల్లిదండ్రులు చూసినప్పుడల్లా, క్రిస్ క్రాస్ పొజిషన్లో లేదా కాళ్లను నిటారుగా పెట్టి కూర్చోమని చెప్పాలి. అలా వదిలేయడం మంచిది కాదు. పిల్లలను బీన్ బ్యాగ్ లేదా కుర్చీలో కూర్చోబెట్టి వారికి ఎలా కూర్చోవాలో ప్రాక్టీస్ ఇవ్వండి.
మీ పిల్లవాడు తక్కువ కండరాల టోన్, చలనశీలత తగ్గడం, సమతుల్యత లేకపోవడం, నొప్పి వంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే డబ్ల్యూ పొజిషన్లో కూర్చోకుండా చూసుకోవాలి. వారిలో హిప్ డిస్ప్లాసియా వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.