Best Web Hosting Provider In India 2024
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోని విజయవాడ, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాలపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పుడిప్పుడే ఆ వర్షాలు, వరదల నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. మళ్లీ వర్షాలు పడొచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. సెప్టెంబర్ 17వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈనెల 10వ తేదీ నుంచి ఏపీలో ఎక్కడో ఒకచోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన టి.బాలాజీ.. వర్షాల గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సంవత్సరం తెలంగాణకు రుతుపవనాలు మరిన్ని ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో వర్షాలు అక్టోబర్ 20 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనాలు, తుఫానులు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని టి.బాలాజీ అంచనా వేశారు. సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి రెండు వారాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 10 వరకు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని బాలాజీ వివరించారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే.. వాతావరణ శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ.. గతంలో బాలాజీ ప్రెడిక్ట్ చేసినట్టు వర్షాలు కురిశాయి. దీంతో బాలాజీ చెబుతున్న విషయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేసి బాలాజీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడిస్తున్నారు.
టాపిక్