Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూచన
తిరుపతి లడ్డూపై అదేపనిగా దారుణ దుష్ప్రచారం
జగన్‌గారిని కించపరుస్తున్నామని అనుకుంటున్నారు
కానీ స్వామివారిని, టీటీడీ విశిష్టతను దెబ్బ తీస్తున్నారు
రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడినే వాడుతున్నారు
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దన్న సుప్రీంకోర్టు
కనీసం దాన్నీ చంద్రబాబు పట్టించుకోవడం లేదు
మాజీ మంత్రి కన్నబాబు ఆగ్రహం
ఎప్పటికప్పుడు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
ఇకనైనా అవి మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
ఇసుక కొరత, దారుణంగా పెరిగిన సరుకుల ధరలు
యథేచ్ఛగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు
అన్ని వర్గాల్లోనూ అశాంతి. అన్నింటా ప్రభుత్వ వైఫల్యం
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కన్నబాబు స్పష్టీకరణ
కాకినాడ: దేశంలో తెలుగుదేశం పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ మరేదీ లేదని, ప్రజా సమస్యలను పూర్తిగా వదిలేసిన కూటి ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఏ దిశలో నడుపుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 100 రోజుల పాలనలో అన్నింటా విఫలమైన ప్రభుత్వం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, టీటీడీ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. కల్తీనెయ్యి ఆరోపణల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు కానున్న ‘సిట్’ నిష్పాక్షిక విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాల కన్నబాబు కోరారు. కాకినాడలోని క్యాంప్ ఆఫీస్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
ప్రచార ఆతృత మానండి:
రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన కన్నబాబు, ఇప్పుడు టీటీడీలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అక్షేపించారు. తిరుమలలో గోవింద నామస్మరణ బదులు చంద్రబాబు స్మరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంతో లబ్ధి పొందాలనే ఆతృత తప్ప, వారికి స్వామివారిపై భక్తి లేదని తేల్చి చెప్పారు. లడ్డూ వివాదంలో జగన్‌గారిని కించపరుస్తాన్నామనుకుంటూ, శ్రీ వెంకటేశ్వరస్వామివారిని, టీటీడీ విశిష్టతను దెబ్బ తీస్తున్నారన్న ఆయన, ఇంకా ఎంత కాలం కట్టుకథలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని, సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున, ఇకనైనా చవకబారు విమర్శలు మానాలని హితవు చెప్పారు.
మండుతున్న సరుకుల ధరలు:
ఇటీవల జిల్లాలో సంభవించిన వరదలకు వేలాది కుటుంబాలు నష్టపోయి, లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బ తిన్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన చెందారు. నిత్యావసరాల ధరలు మండుతున్నాయన్న కన్నబాబు.. కొన్నింటి ధరలు ప్రస్తావించారు.
కిలో ఉల్లి రైతు బజారులో రూ.60కి పైనే ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.75కు పైగా పలుకుతోందని, 25 కేజీల బియ్యం ధర రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా «నిత్యాసరాల ధరలు పెరిగితే, ధరల స్థిరీకరణ నిధి నుంచి ఖర్చు చేసి తక్కువ ధరకు వినియోగదార్లకు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఉచిత ఇసుక ఏది?:
గత ప్రభుత్వ హయాంలో ఇసుకపై నానా రభస చేసిన టీడీపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దోపిడి వల్ల రాష్ట్రంలో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడిందని మాజీ మంత్రి తెలిపారు. మరోవైపు రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేసి, ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక ఇసుక రసీదును ప్రస్తావించిన ఆయన, రవాణా ఖర్చు రూ.9276తో పాటు, మొత్తం ఇసుక ధరను రూ.16,640గా చూపారని చెప్పారు. అంత మొత్తాన్ని అదనంగా ఎందుకు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ట్రక్కు ఇసుక రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు దొరకగా, ఇవాళ రూ.30 వేలకు తక్కువ లేదని, విశాఖలో ఏకంగా రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు.
అన్నింటా అంతులేని నిర్లక్ష్యం:
రాష్ట్రంలో ఇటీవల వర్షాలతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్న కన్నబాబు, దాదాపు 15 లక్షల ఎకరాల్లో సాగు లేదని, మరో 6 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా సరే సరిగా లెక్కలు వేయడం లేదని ఆక్షేపించారు. ముస్లిం కుటుంబానికి చెందిన బాలిక పుంగనూరులో శవమై తేలితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మాజీ మంత్రి గుర్తు చేశారు.