Best Web Hosting Provider In India 2024
ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి
మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్
సంక్షోభం నుంచి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు
అందుకు భిన్నంగా ప్రతి చోటా అంతులేని అవినీతి
లిక్కర్, శాండ్.. ప్రతిచోటా సిండికేట్. మాఫియా దోపిడి
విజయవాడ వరద సాయంలోనూ రూ.500 కోట్ల అవినీతి
బాబు హయాంలో అవినీతి వరదలో బురద కలిసినట్లుంది
మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపణ
కార్పొరేట్ల నుంచి కిట్టీ బ్యాంక్‌ల వరకు పెద్ద ఎత్తున విరాళాలు
అలా వచ్చిన విరాళాలను ఏం చేశారు? ఎక్కడ ఖర్చు చేశారు?
అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు వ్యయం చేశారా?
ఇంతకన్నా హాస్యాస్పదం మరెక్కడైనా, ఏదైనా ఉంటుందా?
లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కనీసం అంచనాలు లేవు
రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు
ప్రెస్మీట్లో తేల్చి చెప్పిన కురసాల కన్నబాబు
కాకినాడ: రాష్ట్రానికి వరదలు వచ్చినా, కరవు వచ్చినా సరే చంద్రబాబు పండుగ చేసుకుంటారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సంక్షోభం నుంచి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అవినీతి రాజ్యమేలుతోందని, లిక్కర్, శాండ్ సిండికేట్లు మాఫియాలా మారి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాయని ఆక్షేపించారు. కాకినాడ క్యాంప్ ఆఫీస్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
విజయవాడలో వరద సాయంలోనూ అడ్డగోలు లెక్కలు చూపి, ఏకంగా రూ.500 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో అవినీతి వరదలో బురద కలిసినట్లు ఉందని కన్నబాబు వ్యాఖ్యానించారు.
సంక్షోభం వస్తే చాలు కార్పొరేట్ల నుంచి కిట్టి బ్యాంక్‌ల వరకు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి ప్రస్తావించారు. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు అలా సేకరించిన విరాళాలు ఎక్కడ, ఎంతెంత వ్యయం చేశారని ప్రశ్నించారు.
విజయవాడ వరద బాధితుల భోజనాలకు రూ.368 కోట్లు, తాత్కాలిక సహాయ శిబిరాలకు రూ.1.39 కోట్లు, మంచినీళ్ల బాటిళ్లకు రూ.26.80 కోట్లు, మెడికల్ క్యాంప్‌ల నిర్వహణకు రూ.2 .8 కోట్లు, వరద బాధితుల నిత్యావసర సరుకులకు రూ.61 కోట్లు, పారి«శుద్ధ్య పనులకు రూ.51 కోట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదమని కన్నబాబు అన్నారు. ఇంకా డ్రోన్లకు రూ.2 కోట్లు, బోట్ల అద్దెకు రూ.93 లక్షలు, తాత్కాలిక వాహనాలకు రూ.4.70 కోట్లు ఖర్చు చేశామనడం మరిన్ని సందేహాలు కలిగిస్తోందని చెప్పారు. విజయవాడ వరద బాధితుల కోసం రూ.534 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మరి ఇప్పటికీ బాధితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని.. అలాంటప్పుడు సాయం ఎవరికి అందిందని కన్నబాబు నిలదీసారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టంపై ఇప్పటికీ అంచనాలు వేయలేదని గుర్తు చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయన్న మాజీ మంత్రి.. తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో టీడీపీ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి దుర్మార్గంగా వ్యవహరించాడని, «సత్యసాయి జిల్లా ధర్మవరంలో సాక్షాత్తు సీఐ తల్లిని కిడ్నాప్ చేసి హత్య చేశారని ప్రస్తావించారు. ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ కుటుంబానికే రక్షణ లేకుండా పోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతున్నాయని కన్నబాబు వివరించారు.