విజయవాడ :
కే యల్ యూనివర్సిటీలో నిర్వహించిన అపస్కాన్- 2022 సదస్సులో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
– కోవిడ్‌పై పోరాటంలో ఎనలేని సేవలందించారు ..
– వైరల్ వ్యాధులపై పరిశోధనలు జరగాలి ..
– ప్రభుత్వం అండగా నిలవడంతోనే జయించాం ..
– అప్సకాన్- 2022 సదస్సులో వక్తలు ..
విజయవాడ: కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వైద్యులు పల్మనాలజిస్టులని వక్తలు కొనియాడారు. విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం వద్దనున్న కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర ఆధ్వర్యంలో మూడు రోజుల అప్సకాన్- 2022 సదస్సులో రెండో రోజైన శనివారం పలు అంశాలపై వక్తలు ప్రసంగించారు ..
ముఖ్య అతిథిగా డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డా. పి. శ్యాంప్రసాద్ హాజరై ప్రసంగించారు. రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని, ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి బయట పడుతున్నామని అన్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, ఆ సమయంలో వారికి చికిత్స అందించడానికి పల్మనాలజిస్టులే కీలకమని వివరించారు. ప్రతి రోజూ వేలాది మంది కోవిడ్ బాధితులు ఆసుపత్రులకు వచ్చిన పరిస్థితుల్లో.. హాస్పిటల్ థియేటర్లో ఉండి ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు పల్మనాలజిస్టులు శాయశక్తులా ప్రయత్నం చేశారని కొనియాడారు. తోటి వారిని ముట్టుకోవడానికే భయపడేలా చేసిన కరోనా సోకిన వారికి అతి సమీపంలో ఉండి, అవసరమైన ప్రతి వైద్య సేవలను అందించారని వివరించారు. గౌరవ అతిథి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. ఎం. రాఘవేంద్రరావు మాట్లాడుతూ పల్మనాలజిస్టులు, వైద్యులు ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించడం వల్లే కరోనాను దేశంలో నియంత్రించగలిగామని పేర్కొన్నారు. అయితే కరోనాపై పోరులో చికిత్సలు అందించిన పల్మనాలజిస్టులకు ఆశించిన గుర్తింపు కానీ, ప్రశంసలు, ప్రచారం కానీ రాలేదని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్సలందించే క్రమంలో విధి నిర్వహణలో ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినా వెనకడుగు వేయకుండా చికిత్సలందించారని కొనియాడారు.
సదస్సులో గౌరవ అతిథి నందిగామ శాసనసభ్యులు & ప్రముఖ పల్మనాలజిస్టు డా. మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వానికి ఆదాయవనరులు తగ్గినా, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగం కోసం మాత్రం అవసరమైన అన్ని నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేశారని, అందువల్లే కోవిడ్‌పై సాగించిన పోరులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. అత్యవసరంగా అదనపు ఆసుపత్రులను ఏర్పాటు చేయడంలోగానీ, ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడంలోగానీ, ఖరీదైన మందులు అందించడంలో, ల్యాబుల ఏర్పాటులో, వైద్య పరికరాల కొనుగోలులో ఎంతో వేగంగా ముఖ్యమంత్రి స్పందించారని వివరించారు. అలాగే అత్యవసర ప్రాతిపదికన వైద్య సేవలు అందించేందుకు అదనంగా సిబ్బందిని నియమించి, ప్రజలకు భరోసాగా నిలిచారని తెలిపారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రభుత్వం అండగా నిలిచి, అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని గుర్తు చేశారు. పల్మనాలజిస్టులకు సంబంధించిన ఏ సమస్యనైనా సీఎం వద్దకు తీసుకెళ్లి, పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. అలాగే వైద్యరంగానికి సంబంధించి విస్తృతమైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని, అందుకోసం రాష్ట్రంలో పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు. రాబోయే కాలంలో కోవిడ్ వంటి వైరల్ వ్యాధులను ఎదుర్కునేలా పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని వివరిస్తానన్నారు. కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కె సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని, వాటి వల్ల ఎంతో మంది నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారని తెలిపారు. తద్వారా వైద్యరంగంలో ఉన్న నిపుణుల కొరతను అధిగమించడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్మనాలజీని ఎంపిక చేసుకుని వైద్యరంగంలోకి ప్రవేశించిన డాక్టర్ల ప్రాధాన్యత ఏంటనేది కోవిడ్ సమయంలో ప్రజలందరికీ అర్థమైందని వివరించారు. ఊపిరితిత్తులకు చికిత్సనందించడంలో పల్మనాలజిస్టులది కీలక పాత్ర అని, కోవిడ్ సమయంలో వారంతా విశేష సేవలందించారని తెలిపారు. కోవిడ్ లాంటి వైరల్ వ్యాధులు బయటపడినా ఎదుర్కోగలిగిన సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందని గత రెండేళ్లలో నిరూపితమైందన్నారు. అలాగే వాటిని నియంత్రించగలిగే, మెరుగైన చికిత్సలందించగల నైపుణ్యాలు, ధైర్యం మన వైద్యుల వద్ద ఉందని వివరించారు ..
ఈ సదస్సులో కేఎల్ఈఎఫ్ వైస్ చాన్స్‌లర్ డా. జీపీఎస్ వర్మ, అప్సకాన్ కార్యనిర్వాహక అధ్యక్ష, కార్యదర్శులు డా. జి. బాబూరావు, డా. ఎం. రవీంద్రనాథ్, 13 జిల్లాల నుంచి వచ్చిన పల్మనాలజిస్టులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు. ఆదివారం స్పెషలిస్టుల ఒరేషన్స్, మెడికల్ విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్, అబ్‌స్ట్రాక్ట్స్, పోస్టర్ ప్రజంటేషన్స్, నిపుణుల ప్రసంగాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.