Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి ఆయన హోం మంత్రి నివాసంలో అమిత్ షా తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపీ భవన్ సహా షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజనపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్నీ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీ విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, వెంటనే ఈ బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.