Best Web Hosting Provider In India 2024
ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ పూర్తైంది. రెండేళ్ల పాటు అమల్లో ఉండే కొత్త మద్యం పాలసీకి అనుగుణంగా 26 జిల్లాల్లో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు లాటరీ విధానంలో షాపులను కేటాయిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. కాసులు కురిపించే వ్యాపారం కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. లాటరీ విధానంలో పూర్తిగా పారదర్శకంగా షాపులను కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బీజేపీ నేతకు 5 షాపులు
సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లాటరీ ప్రక్రియ కొనసాగింది. షాపుల కేటాయింపు పూర్తిగా అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇవాళ లక్ ఉన్నవారికి లాటరీల్లో షాపులు వచ్చాయి. షాపు వచ్చిన వారు నగదు సమీకరించే పనిలో ఉన్నారు. మద్యం షాపుల లాటరీలో కొందరికి అదృష్టం బాగా కలిసొచ్చింది. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు ఏకంగా ఐదు మద్యం దుకాణాలు దక్కాయి. పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో చేపట్టిన లాటరీ ప్రక్రియలో… ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4, ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ మద్యం షాపులు ఆయనకు దక్కాయి. ఒక్కరికే ఐదు దుకాణాలు దక్కడం గమనార్హం.
9కి బదులుగా 6 నెంబర్ ప్రకటన
శ్రీకాకుళం జిల్లాలో అధికారుల చిన్న పొరపాటు…గందరగోళానికి దారితీసింది. శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ చేపట్టారు. ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు లక్కీ డ్రాలో 9వ నంబర్ వచ్చింది. అయితే ముందుగా దానిని 6వ నంబర్ అని మైక్‌లో చెప్పారు. దీంతో 6 నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి సంబరాలు చేసుకున్నాడు. ఇంతలో అది 6 కారు పొరపాటున చెప్పాం, 9వ నెంబర్ అని అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే క్రాస్ చెక్ చేశారు. దీంతో అది 9వ నంబర్ అని తేలింది.
ముందుగా 6వ నంబర్ ప్రకటించటంతో ఆనందపడిన దరఖాస్తుదారుడు.. లక్కీ డ్రా విజేత 9వ నెంబరు అని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అధికారులు నంబర్ కావాలనే మార్చేశారని ఆరోపించారు. అధికారులతో వాదనకు దిగడంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం దుకాణం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తుంటే… తమ ఆశలపై అధికారులు నీళ్లు చల్లారని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారం కావడంతో అధికారులు మరింత కట్టుదిట్టంగా వ్యవహించాలని దరఖాస్తుదారులు సూచించారు. కాసేపు కరెంట్ పోవడంతో గందరగోళం నెలకొంది. కరెంట్ వచ్చాక… ఆందోళన చేస్తున్న వారిని పిలిచి అధికారులు సర్దిచెప్పారు. 6, 9 నెంబర్ మధ్య వ్యత్యాసాన్ని తెలియజేశారు. దీంతో లాటరీ ప్రక్రియ ముందుకు సాగింది.
సంబంధిత కథనం
టాపిక్