IAS Officers : క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు, డీవోపీటీ ఉత్తర్వులు ర‌ద్దు చేయాలని పిటిషన్లు దాఖలు

Best Web Hosting Provider In India 2024


ఇటీవ‌లి ఏపీ కేడ‌ర్ అధికారుల‌ను రిలీవ్ చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేప‌థ్యంలో న‌లుగురు ఐఏఎస్ అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్‌)ను ఆశ్రయించారు. మొత్తం న‌లుగురు ఏపీ కేడ‌ర్ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖ‌లు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి కోర‌గా, ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన ఐఏఎస్ అధికారిని సృజన కోరారు.

ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఎంపికై, తెలంగాణలో పనిచేస్తున్న ఐఎఎస్‌ అధికారులకు రిలీవ్ చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శుల‌కు డీవోపీటీ లేఖలు రాసింది. ప్రత్యుష్ సిన్హా కమిటీ ఏపీకి కేటాయించిన 11మంది ఐఎఎస్‌ అధికారుల్ని తక్షణమే సొంత రాష్ట్రాల్లో విధుల్లో చేరేందుకు రిలీవ్ చేయాలని ఆదేశించింది. 2023 జనవరిలో అప్పటి తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు మిగిలిన అధికారులకు వర్తిస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో డీవోపీటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న 11మంది ఆలిండియా సర్వీస్ అధికారులు హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమకు తెలంగాణ క్యాడర్‌ కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా డీవోపీటీ అందుకు అనుమతించలేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత ప్రత్యుష్‌ సిన్హా కమిటీ అధికారుల విభజన చేపట్టింది. 52: 48 నిష్పత్తిలో అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించింది. అయితే కొంతమంది అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు.

ఇలా పనిచేస్తున్న వారిలో కొందరు రిటైర్ అయిపోయారు. ఈ నేపథ్యంలో 11 మంది ఐఎఎస్‌లను సొంత రాష్ట్రాలకు బదిలీ చేస్తూ డీవోపీటీ రాష్ట్రాలకు లేఖ రాసింది. సోమేష్‌ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు తర్వాత మిగిలిన అధికారుల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. మాజీ డీజీపీ అంజనీకుమార్‌, రోనాల్డ్‌ రాస్‌, జె.అనంతరాము, ఎస్‌.ఎస్‌.రావత్‌, ప్రశాంతి ఆమ్రపాలి, అభిలాష బిస్త్‌, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, తదితరుల కేటాయింపులకు సోమేశ్‌కుమార్‌ వ్యవహారంలో వెలువరించిన తీర్పే వర్తిస్తుందని తెలిపారు. అయితే 11 మందిలో న‌లుగురు ఐఏఎస్ అధికారులు మాత్రమే క్యాట్‌ను ఆశ్రయించారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం

టాపిక్

Ias OfficersAndhra Pradesh NewsTelangana NewsTrending ApTrending TelanganaHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024