AP Liquor Tender 2024 : ఏంటి సుధా! లిక్కర్ షాపులకు ఇంత డిమాండు, రూ.2 లక్షల పెట్టుబడికి రూ.కోటి ఆఫర్-రంగంలోకి సిండికేట్లు

Best Web Hosting Provider In India 2024

ఏపీలో మద్యం షాపుల లాటరీలో కొందరికి లక్కు బాగా కలిసొస్తుంది. లక్కీ డ్రాలో మద్యం షాపులు దక్కిన వారికి సిండికేట్లు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. నిన్న నిర్వహించిన మద్యం షాపుల లాటరీలో పలువురు సామాన్యులు షాపులు దక్కించుకున్నారు. ఇప్పుడు సిండికేట్లు వీరిపై కన్నేశారు. సామాన్యులు మద్యం షాపు నిర్వహణ, ఇతర ఖర్చులకు దాదాపుగా రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో అంత స్థోమత లేనివారిపై సిండికేట్లు ఒత్తిడి తెలుస్తున్నారు. షాపు వదిలిస్తే రూ.కోటి నుంచి రూ.1.2 కోట్ల వరకు ముట్టచెబుతామని అంటున్నారు. దీంతో పాటు ప్రతి నెలా రూ.15 వేలు గుడ్ విల్ కింద ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ ఆఫర్లకు షాపులు దక్కిన కొందరు సామాన్యులు ఆలోచనలో పడ్డారు. రూ.2 లక్షలతో మద్యం షాపునకు దరఖాస్తుకున్న వారికి ఇప్పుడు రూ.కోటి రాబడి వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మద్యం షాపులు దక్కిన సామాన్యులపై సిండికేట్లు కన్నేశారు. కొందరు ప్రత్యక్షంగా బెదిరింపులకు పాల్పడుతుంటే, మరికొందరు కిడ్నాప్ లకు సైతం వెనకాడడంలేదు. ఆఫర్లు ఇస్తూ షాపులు వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కొందరు భారీగా డబ్బు ఆఫర్ చేస్తుంటే…మరికొందరు ఎంతో కొంత ఇస్తామంటున్నారు. కోట్లు కురిపించే లిక్కర్ వ్యాపారం అంటే ఆ మాత్రం ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దరఖాస్తుల సమయంలోనే ఎమ్మెల్యేల తరఫున సిండికేట్లు భారీగా రంగంలోకి దిగారని ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు హెచ్చరించినా…కొందరు ఎమ్మెల్యేలను తమ అనుచరులతో భారీగా దరఖాస్తులు చేయించారు. లక్కీ డ్రాలో లక్కు కలిసిరాకపోవడంతో… ఇప్పుడు మరో మార్గంలో షాపులు దక్కించునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మద్యం షాపుల లాటరీలో లక్కు కలిసొచ్చిన వాళ్లు చిందులేస్తుంటే, షాపులు రానివారు నిరాశపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ బాధ చెప్పుకుంటున్నారు. ఓ ఔత్సాహికుడు ఎక్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తాను, తన మిత్రులు ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం రూ.7.16 కోట్లతో దరఖాస్తు చేసుకున్నామని ట్వీట్ చేశారు. ఎన్ని లైసెన్సులు వచ్చాయనేదీ పక్కన పెడితే.. మొత్తం 358 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేశామన్నారు. లాటరీలో 10 మద్యం దుకాణాలు మాత్రమే వచ్చాయని చెప్పారు. డబ్బులు పోయినందుకు మాత్రం బాధ లేదని, రాష్ట్రాభివృద్ధి కోసం ఏడు కోట్లు విరాళం ఇచ్చామని గర్వంగా ఫీలయ్యామని ట్వీట్ చేశారు.

లిక్కర్ సిండికేట్లు రంగంలోకి దిగారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారిని సిండికెట్లు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తుండడంతో లాటరీ విజేతలు భయాందోళనకు గురవుతున్నారు. లైసెన్స్ ఫీజు చెల్లిస్తే తర్వాత దౌర్జన్యంగా షాపు గుంజుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మద్యం వ్యాపారంలో కచ్చితంగా వాటా ఇవ్వాలని, లేదంటే వ్యాపారం సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు సిండికెట్లు.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పల్నాడు జిల్లాల్లో ఇప్పటికే బెదిరింపుల సార్ట్ అయ్యాయని సమాచారం. దీంతో షాపులు దక్కించుకున్న వారికి ఆనందంలేకుండా పోయింది. లైసెన్సులు వచ్చినా ఫీజులు చెల్లించాలా? వద్దా? అనే డౌట్ లో పడ్డారు. ఈ విషయం సీఎం చంద్రబాబు వరకూ వెళ్లడంతో లైసెన్సులు దక్కించుకున్నవారిని ఇబ్బంది పెడితే ఎవరినీ ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

LiquorAndhra Pradesh NewsViral ApLiquor ScamTelugu NewsTrending Ap
Source / Credits

Best Web Hosting Provider In India 2024