Best Web Hosting Provider In India 2024
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో ఉత్తరాంధ్ర మత్స్యకారుడి పాత్రను చైతూ పోషిస్తున్నారు. దీంతో ముందు నుంచి ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. తండేల్ మూవీకి చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ రిలీజ్‍పై తాజా ఇంట్రెస్టింగ్ రూమర్ బయటికి వచ్చింది.
సంక్రాంతి బరిలో..
తండేల్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ముందుగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. అయితే, అప్పటికల్లా అన్ని పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదట. దీంతో 2025 సంక్రాంతి బెస్ట్ అని భావిస్తున్నారని తెలుస్తోంది.
రసవత్తరంగా సంక్రాంతి పోటీ
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి వస్తోంది. 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. బాలకృష్ణ – డైరెక్టర్ బాబి కొల్లి మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉంది. విస్టరీ వెంకటేశ్ – దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ, సందీప్ కిషన్ ‘మజాక’ కూడా ఆ పండుగకే రానున్నాయి. అయితే, తండేల్ కూడా సంక్రాంతికే వస్తే బాక్సాఫీస్ పోరు మరింత హీట్ ఎక్కనుంది.
తమ సినిమాపై తండేల్ మేకర్స్ చాలా నమ్మకంతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో ఎంత పోటీ ఉన్నా సంక్రాంతికే రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సంక్రాంతికే వస్తే ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సహా మిగిలిన చిత్రాలతో తండేల్ పోటీ పడాల్సి ఉంటుంది.
తండేల్ సినిమాను జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నాగచైతన్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఉండనుంది. పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తండేల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ఈ మూవీని నాగచైతన్య కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. లుక్‍ను పూర్తిగా మార్చటంతో పాటు శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా చైతూకు సరైన హిట్ లేకపోడంతో తండేల్ చాలా ముఖ్యంగా మారింది.
పాకిస్థాన్ సైన్యం చేతిలో రెండేన్నరేళ్ల పాటు చిత్రహింసలకు గురై, ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత ఘటనల ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఆసక్తిని పెంచింది. దేశభక్తి, ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి శివరాత్రి జాతర సాంగ్‍ను టీమ్ తీసుకురానుంది.