Best Web Hosting Provider In India 2024
గ్రామాల్లో పాలన పడకేసి పది నెలలు తొమ్మది నెలలు కావొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. కొత్త పంచాయతీల పాలకవర్గాలన్నీ అదే ఏడాది ఫిబ్రవరిలో కొలువు దీరాయి. ఈ ఏడాది ఫిబవరిలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలు పదవుల నుంచి దిగిపోగా పంచాయతీల బాగోగులు పట్టించుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.
పాత పాలక వర్గాల పదవీ కాలం పూర్తయ్యాక ఎన్నికలు నిర్విహించాల్సిన స్థానే వివిధ కారణాలతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ఈ కారణంగానే గ్రామాలను స్పెషల్ అధికారుల చేతిలో పెట్టింది. వాస్తవానికి ఈ పాటికే ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు, రిజర్వేషన్ల ఖరారు విషయంలో నెలకొన్న సందిగ్ధం వల్ల విషయం కొలిక్కి రావడం లేదు.
రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే కుల గణన పూర్తి కావాల్సి ఉంది. కులాల జనాభా లెక్కలు తేలితే కానీ రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది మరో రెండున్నర నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇక, ఈ ఏడాది స్థానిక సమరం లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కుల గణన సర్వేకు శ్రీకారం..!
కులాల వారీ జనాభా లెక్క తేల్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాసనసభ ఎన్నికల సయమంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల ప్రధాన హామీల్లో కుల గణన ఒకటి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పది నెలలు గడిచిపోయింది. కేవలం మరో రెండు నెలల్లోపు సమయంలోనే ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో కుల గణన, ఆర్ధిక, సామాజిక, రాజకీయ సర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 13ను విడుదల చేసింది.
ఈ జీవో ప్రకారం సర్వే పూర్తి చేయడానికి రెండు నెలల గడువు విధించింది. ఫలితంగా స్థానిక సంస్థల అయిన గ్రామ పంచాయతీలతో పాటు, మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు కూడా ఎన్నికలు ఈ ఏడాది జరగనట్టేనేని అభిప్రాయం పడుతున్నారు. కుల గణన, సర్వే డిసెంబరు 15వ తేదీలోగా పూర్తి చేయాలని గడువు విధించిన నేపథ్యంలో.. సర్వే ఫలితాలపై చర్చలు జరిపిన, తుది నివేదిక రూపొందాకే రిజర్వేషన్లు ఖరారు అవుతాయని, ఆ తర్వాతే కొత్త రిజర్వేషన్ల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది వరసగా ఎన్నికలే.. ఎన్నికలు
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది దాదాపు సాంతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఇప్పటికే పదవీ కాలాలు పూర్తయ్యి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పదినెలలుగా మగ్గుతున్న గ్రామ పంచాయతీలకు ఎన్నికల జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఇటీవల మూడు నెల్ల కిందట పదవీ కాలం పూర్తయిన మండల పరిషత్ లకు, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికోసం మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యలు ( ఎంపీటీసీ సభ్యలు), జిల్లా ప్రాదేశిక నియోజజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ సభ్యులు) ఎన్నికలు జరిపి, పరోక్ష పద్దతిలో తిరిగి మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది జనవరితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక వర్గాల పదవీ కాలం కూడా పూర్తవుతుంది. దీంతో వీటికి కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అటు రూరల్, ఇటు అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉన్నందున వచ్చే ఏడాదిలో దాదాపు సాంతం ఎన్నికలే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )
సంబంధిత కథనం
టాపిక్