Rythu Runa Mafi Updates : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్-అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి, త్వరలోనే రైతు భరోసా

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాగా…పలు సాంకేతిక కారణాలతో పలువురికి రుణమాఫీ నిలిచిపోయింది. రుణమాఫీ కాని వారి సమస్యలు పరిష్కరించి…అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు సాంకేతిక అడ్డంకులు తొలగించే పనిలో ఉన్నారు. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రులు అంటున్నారు.

రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్న, అర్హులైన వారందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. నవంబర్ 1 నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న రైతుల రుణమాఫీపై ప్రక్రియ చేపడతామన్నారు. దీంతో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులు… ముందుగా పైన ఉన్న రుణాన్ని అక్టోబర్ 31లోపు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే రూ.31 వేల కోట్ల రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం నల్లగొండ ఎస్ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ….గత 5 ఏళ్లలో రైతులు ఏ బ్యాంకులో ఎంత రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించిందన్నారు.

ఇప్పటి వరకూ 22 లక్షల రేషన్ కార్డులు కలిగిన రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి రేషన్ కార్డులు మిగిలిన 4 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. రూ.2 లక్షల పైన రుణాల మాఫీపై షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ పంట కాలంలోనే రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

త్వరలోనే రైతు భరోసా

రైతు భరోసాపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. త్వరలోనే రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. 2025 మార్చి 31 లోపు రైతులందరికీ రైతు భరోసా కింద 2 విడతల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

Whats_app_banner

టాపిక్

Crop LoansTelangana NewsTrending TelanganaGovernment Of TelanganaTelugu NewsFarmersAgriculturePaddy Procurement
Source / Credits

Best Web Hosting Provider In India 2024