Best Web Hosting Provider In India 2024
తమిళ స్టార్ తలైవా రజినీకాంత్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం కలిసి ఓ సినిమా చేయనున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబోలో 1991లో వచ్చిన ‘దళపతి’ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. మళ్లీ 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరు కలిసి మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషంయలో సీనియర్ నటి, మణిరత్నం భార్య సుహాసినీ తాజాగా ఓ ఇంటర్వ్వూలో క్లారిటీ ఇచ్చేశారు.
వాళ్లిద్దరికీ కూడా తెలియదు
రజినీకాంత్, మణిరత్నం కాంబినేషన్‍లో సినిమా ఆలోచన ఇప్పుడు లేదని సుహాసిని చెప్పేశారు. రూమర్లపై వెటకారంగా స్పందించారు. ఈ విషయం రజినీ, మణి కూడా తెలియదని సుహాసినీ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “రజినీకాంత్, మణికి కూడా ఈ విషయం తెలియదని అనుకుంటా. కేవలం ఇవి రాసే వారికే తెలుసు” అని సుహాసినీ చెప్పారు.
నిరాశ
రజినీకాంత్, మణిరత్నం కాంబోలో మూవీ వస్తుందనే రూమర్లు కొందరు ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సంతోషించారు. అయితే, ఇప్పట్లో అలాంటిదేమీ లేదని సుహాసినీ తేల్చిచెప్పేశారు. దీంతో అభిమానులకు నిరాశే మిగిలింది.
రూమర్లు ఇవే
రజినీకాంత్ – మణిరత్నం కలయికలో సినిమా ఖరారైందని ఇటీవల సోషల్ మీడియాలో రూమర్లు బయటికి వచ్చాయి. రజినీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12వ తేదీన ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూడా వస్తుందని పుకార్లు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా బజ్ నెలకొంది. అయితే, అలాంటిదేమీ లేదని సుహాసినీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు.
మణిరత్నం సుమారు 36 ఏళ్ల తర్వాత లోకనాయుకుడు కమల్‍హాసన్‍తో కలిసి ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నారు. ‘థగ్‍లైఫ్’ పేరుతో ఈ యాక్షన్ మూవీ రూపొందుతోంది. క్లాసిక్ మూవీ నాయకన్ (1987) తర్వాత కమల్ – మణి కాంబో రిపీట్ అవుతోంది. ఈ క్రమంలోనే రజినీతోనూ ఓ చిత్రం చేస్తారనే రూమర్లు గుప్పుమన్నాయి.
దళపతి గురించి..
మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి హీరోలుగా 1991లో దళపతి చిత్రం వచ్చింది. మహాభారతంలోని కర్ణుడు, దుర్యోధనుడు స్నేహాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీ కథను మణిరత్నం రాసుకున్నారు. ఈ గ్యాంగ్‍స్టర్ డ్రామా చిత్రం అప్పట్లో భారీ బ్లాక్‍బస్టర్ అయింది. రికార్డులను తిరగరాసింది. ఈ మూవీకి ఇసై జ్ఞాని ఇళయరాజా అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా నిలిచింది. దళపతి చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. మళ్లీ రజినీ – మణిరత్నం కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా అని అభిమానులు నిరీక్షిస్తూనే ఉన్నారు.
రజినీ లైనప్
రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ సినిమా గత శుక్రవారం (అక్టోబర్ 10) థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ నటులు కూడా ఉన్నారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. రజినీ తదుపరి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పక్కా యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.