Document Writer Land Grab : ఫేక్ డాక్యుమెంట్ తో వృద్ధురాలి ఆస్తిపై కన్ను, కొత్తగూడెంలో ఓ డాక్యుమెంట్ రైటర్ నిర్వాకం!

Best Web Hosting Provider In India 2024

ఆయనో డాక్యుమెంట్ రైటర్.. అదే అతని అస్త్రం. ఎంతో బాధ్యతాయుతమైన ఈ వృత్తిని ఆసరాగా మార్చుకుని అక్రమాలకు తెరలేపాడు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇతరుల ఆస్తిపై కన్నేయడం పరిపాటిగా మార్చుకున్నాడు. వివాదం సృష్టించడం చివరికి సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు గుంజుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. వేయి గొడ్లను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు నేల కూలినట్లు చివరికి ఓ వృద్ధురాలు తన ఆస్తిని అమ్ముకుంటుంటే తల దూర్చి అడ్డంగా దొరికిపోయాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం త్రీటౌన్ ప్రాంతంలోని గణేష్ బస్తీలో కాసర్ల లక్ష్మి అనే వృద్ధురాలు తన అవసరాల కోసం ఇంటిని విక్రయించింది. బయానా నగదు తీసుకుని ఓ వ్యాపారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. సరిగ్గా అదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ మహ్మద్ జావిద్ రంగ ప్రవేశం చేశాడు. తన భార్య నస్రీమా సుల్తానా పేరిట ఒక లాయర్ ద్వారా నోటీస్ పంపి ఆ వృద్ధురాలిని హడలెత్తించాడు. అంతేకాదు.. ఆ ఆస్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారిని సైతం బెదిరిస్తూ విక్రయానికి అడ్డుపడ్డాడు. కొత్తగూడెం రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ గా పని చేస్తున్న అనుభవంతో 150 గజాలకు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపుతూ మధ్యవర్తుల ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు.

అక్కడ తనకు ఒక గుడిసె ఉందని, ఒక ఫేక్ ఇంటి నెంబర్ ని చూపుతూ ఆ వృద్ధురాలిపై ఒత్తిడి చేయసాగాడు. అతను చూపుతున్న డాక్యుమెంట్ లో అసలు సర్వే నెంబరే లేకపోవడం విడ్డూరం. వాస్తవానికి ఆ వృద్ధురాలు ఆ ఇంట్లో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటోంది. నాటి నుంచి ఇంటి పన్ను రశీదులు కూడా భద్రంగా ఉన్నాయి. అయినా ఆమెను హడలెత్తిస్తూ విక్రయానికి అడ్డు పడ్డాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె అనారోగ్యంపాలైంది. తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టిస్తూ పేదల ఆస్తులపై కన్నేసే ఆ అక్రమార్కుడికి ఓ “పాషా”ణ హృదయుడు అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది.

బంధువుల చొరవతో

ఆ వృద్ధురాలి పరిస్థితిని గమనించిన ఆమె బంధువులు రంగంలోకి దిగారు. ఆ డాక్యుమెంట్ రైటర్ బండారం బయట పెట్టేందుకు పూర్తి స్థాయిలో వివరాలను ఆధారాలతో సహా సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమగ్ర విచారణ జరిపిన పోలీసులు ఆ డాక్యుమెంట్ రైటర్ ఫేక్ డాక్యుమెంట్ తో ఆ వృద్ధురాలిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తేల్చారు. దీంతో ఆ డాక్యుమెంట్ రైటర్ తన సామాజికవర్గ అనుచర గణంతో పాటు రాజకీయ పైరవీకి సైతం తెరలేపాడు. పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ తన పంతం నెగ్గించుకుని లక్షల సొమ్ము కాజేయాలని చూశాడు. కాగా ఆ వృద్ధురాలి తరపు బంధువులు కూడా రాజీ పడకుండా ఉన్నతాధికారులను ఆశ్రయించి జరుగుతున్న విషయాన్ని వారి కళ్లకు కట్టారు. ఫలితంగా ఎట్టకేలకు ఆ డాక్యుమెంట్ రైటర్ జావిద్ పై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధ్యత మరిచి.. పైసలు మరిగి

ఆస్తి విక్రయ సమయంలో అటు విక్రయించిన వారికి, ఇటు కొనుగోలు చేసిన వారికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ ఎంతో కీలకమైన పాత్ర పోషించాల్సింది డాక్యుమెంట్ రైటరే. అలాంటి గురుతర బాధ్యతను, విద్యుక్త ధర్మాన్ని విస్మరించిన సదరు డాక్యుమెంట్ రైటర్ జావిద్ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. పాత స్టాంపు పత్రాలను వినియోగిస్తూ తప్పుడు పత్రాలను సృష్టిస్తూ ఇలా చాలా మందిని అతను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తికి రాజకీయ పెద్దలు న్యాయ, అన్యాయాలను విస్మరించి వెన్నుదన్నుగా నిలవడమే విస్మయం కలిగిస్తోంది.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Bhadradri KothagudemCrime TelanganaTelangana NewsTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024