Best Web Hosting Provider In India 2024
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ వైపు దూసుకొస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 190 కి.మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, నెల్లూరుకి 270 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యిందని తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా 17 కి.మీ వేగంతో కదులుతుందని వెల్లడించింది. రేపు(గురువారం) తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తరువాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. సముద్రపు అలలు ఉద్ధృతంగా ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
వాయుగుండం ప్రభావంతో రేపు దక్షిణకోస్తా,రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
రేపు స్కూళ్లకు సెలవు
భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్లు సెలవు ప్రకటించినా పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. వాయుగుండం రేపు తీరం దాటిన తరువాత కూడా ఏటువంటి పరిస్థితులనైన ఎదుర్కోడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైనా విద్యుత్ అంతరయం కలిగితే తక్షణం పునరుద్ధించడానికి పోల్స్, వైర్లతో విద్యుత్ సిబ్బంది రెడీగా ఉన్నట్లు తెలిపారు. రోడ్లు మీద చెట్లు పడితే వెంటనే తొలగించడానికి జేసీబీలు అందుబాటులో ఉంచమన్నారు.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసివేత
వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి(గురువారం) వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగానికి వర్ష తీవ్రతను బట్టి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం రూ.కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు చేశామన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీ ఉంచామన్నారు.
ప్రకాశం జిల్లా 4, నెల్లూరు జిల్లాలో 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వాయుగుండం ఎక్కువ ప్రభావం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్