Sitting Risks: ఆఫీస్‌లో లేవకుండా గంటల కొద్దీ కూర్చొని పనిచేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే

Best Web Hosting Provider In India 2024


ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆఫీస్‌లో అధిక సమయం కూర్చుని పని చేస్తూ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిరంతరం కూర్చుని పనిచేయడం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ఆ ప్రభావం పడుతోంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెడ, మెడ వెనుక కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దాని ప్రభావంతో శారీరక చలనం తగ్గిపోయి రక్తప్రసరణ సరిగా జరగదు. ఇది అధిక బరువు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

సిట్టింగ్ పొజిషన్

ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్నెముక మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. పొజిషన్ సరిగా లేకపోతే, శరీరం ముందుకు వంగి, వెన్నెముకకు ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన స్లిప్ డిస్క్ సమస్యలు, వెన్ను నొప్పి, కీళ్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి కూర్చొనే విధంపై కూడా మనం శ్రద్ధ పెట్టాలి. ఎలాపడితే అలా కూర్చుని పనిచేస్తే ఇబ్బందులు తప్పవు.

పాదాల నుంచి రక్తనాళాలపై ప్రభావం

ఎక్కువ సేపు కూర్చొనే పని చేయడం వల్ల తక్కువ శారీరక చలనం ఉంటుంది. దాంతో కండరాలు బలహీనపడతాయి. ఇది కేవలం కండరాలకు మాత్రమే కాకుండా, పాదాల నుండి మొదలైన రక్తనాళాలపై కూడా ప్రభావం చూపుతుంది. గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల కండరాలు తగినంత కదలక.. ఒకసారిగా సడన్‌గా కొంచెం కదిలించినా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 30 నుంచి 60 నిమిషాలకి ఒకసారి లేచి నడవడం, కాస్త విరామం తీసుకోవడం అవసరం.

గంటకి 5 నిమిషాలు బ్రేక్

నిరంతర కూర్చోవడం వల్ల రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఇది మెదడుకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందకుండా చేసి, బుద్ధి చురుకుదనం తగ్గిపోవడానికి కారణమవుతుంది. దీని వలన సృజనాత్మకత, ఆలోచనశక్తి దెబ్బతింటాయి. కాబట్టి ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు కుర్చీలో నుంచి లేచి ఆఫీస్‌లోనే కాస్త నడవడం అలవాటు చేసుకోవాలి.

వంగి కూర్చోవద్దు

చాలా మంది పొజిషన్ సరిగా లేకపోవడంతో ఎక్కువగా వంగి కూర్చుంటారు, ఇది ఊపిరితిత్తుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరం సరిగ్గా వంగి ఉండటం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. కాబట్టి పని చేసే కుర్చీ, టేబుల్ పొజిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మోకాలిని 90 డిగ్రీల కోణంలో ఉంచుకోవడం, కంప్యూటర్ స్క్రీన్ కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవడం అవసరం.

కళ్లకీ 20 సెకన్లు రెస్ట్

కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కంటికి సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వీటిలో ముఖ్యంగా కంటిచూపు తగ్గటం, కంటి అలసట, పొడిబారిన కళ్ళు సమస్యలు కనిపిస్తాయి.కాబట్టి.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడటం ద్వారా కంటి అలసటని తగ్గించుకోవచ్చు.

హైబీపీ, హార్ట్ ఎటాక్ సమస్యలు

ఎక్కువ సేపు కూర్చుని ఉండడం గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కూర్చుని పని చేసినప్పుడు శరీరం తక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది, రక్తంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి, ఇది కొవ్వు గడ్డలు ఏర్పడటానికి దారితీస్తుంది. దీని వలన హై బీపీ, గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి. అలానే ప్రతీ గంటకు కూర్చుని ఉన్న చోట నుంచి లేచి కాస్త నడవండి. కళ్లకి కూడా తగినంత విశ్రాంతినిస్తూ మీ ఆఫీస్ పనులు చేసుకోండి.

Whats_app_banner

Source / Credits

Best Web Hosting Provider In India 2024