Group 1 Mains Exams : ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

Best Web Hosting Provider In India 2024

తెలంగాణలో ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. గ్రూప్‌-1 నిర్వహణలో ఎలాంటి అపోహలు, వదంతులకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై గురువారం సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సాంకేతికత, సోషల్‌ మీడియా విస్తృతమైన తరుణంలో పరీక్షల నిర్వహణ సవాలుగా మారింది. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటికి 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు’ అని మహేందర్ రెడ్డి వివరించారు.

రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు నేరుగా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీసు కమిషనర్లు బందోబస్తు ఏర్పాట్లు చూస్తారని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. సీనియర్‌ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని వివరించారు. ఎక్కడా లోపం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని.. ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించాలని సీఎస్ ఆదేశించారు.

హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్‌ జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గది, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పర్యవేక్షించనున్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. స్క్రైబ్‌ అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్‌ టికెట్లపై.. ‘స్క్రైబ్‌’ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నామని.. వీరి కోసం 4 ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. వీరికి అదనంగా గంట సమయాన్ని కేటాయించనున్నారు. గురువారం సాయంత్రం వరకు 90 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.

ఈనెల 20వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఇటు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. డివిజన్ బెంచ్ ఇస్తే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Whats_app_banner

టాపిక్

Ts Group 1ExamsTgpscTspscTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024