Healthy Teeth: దంతాల కోసం ప్రతిరోజూ జస్ట్ బ్రష్ చేస్తే సరిపోదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే అందం, ఆరోగ్యం!

Best Web Hosting Provider In India 2024

మనం నవ్వితే అందరికీ కనిపించే దంతాలు అందమే కాదు, ఆరోగ్యానికీ ప్రతీకలు. ఇప్పటికీ చాలా మంది బ్రష్ చేయడాన్ని ఒక పనిష్మెంట్‌గా ఫీలవుతూ.. ఏదో చేశామంటే చేశామంటూ బ్రష్ చేస్తుంటారు. కానీ.. మనం ఉదయం బ్రష్ చేయడంతో నిర్లక్ష్యం చూపితే ఆ ప్రభావం భవిష్యత్‌లో మనపై పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ దంత రక్షణపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే.

వయసులో ఉన్నప్పుడు అన్నీ ఓకే.. కానీ?

జీవితంలోని అన్నిటిలాగే మీరు వయసులో ఉన్నప్పుడు మీ పళ్ళ విషయంలో చేసే నిర్లక్ష్యం.. వయసు మళ్లాక మిమ్మల్ని వెంటాడే ప్రమాదం ఉంది. కట్టుడు పళ్ళు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లుతో పాటు వాపు తదితర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

వయసులో ఉన్నప్పుడు అన్నీ సాఫీగానే జరిగిపోతాయి. మనకి ఇష్టమైన ఆహారాన్ని వేగంగా తినాలనే ఆత్రుతతో లేదా హడావుడిగా ఎక్కడికైనా వెళ్లడానికి ఏదో బ్రష్ చేశామంటే.. చేశాము అనేలా దంతాల్ని శుభ్రం చేస్తుంటారు. కానీ.. దంత ఆరోగ్యాన్ని సీరియస్‌గా తీసుకోనట్లయితే మీరు పర్యావసానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సమస్య వస్తే.. పళ్లు కదిలిపోతాయ్

దంతాలకి వెలుపల కవరింగ్‌ను ఎనామెల్ అంటారు. ఎమల్స్ కింద డెంటిన్ ఉంటుంది. ఇది కొంచెం మృదువుగా ఉంటుంది. అలానే పళ్ళ మధ్యలో పల్స్ అనే మృదువైన భాగం ఉంటుంది. ఇది రక్తనాళాలు, నరాలతో అనుసంధానమై ఉంటుంది.

మనం దంతాల్ని సరిగా శుభ్రం చేసుకోకపోతే.. పళ్లలో ఉండే ఎమల్స్ పాడవుతాయి. మరీ ముఖ్యంగా ఎక్కువగా తీపి పదార్ధాలు తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. దంత సమస్యలు వస్తే.. పళ్లు కదిలిపోతాయి. అలానే మన రోజువారీ ఆలవాట్లలో ఎక్కువగా కాఫీ, టీ తాగడం, పొగ త్రాగడం వంటివి ఉంటే పళ్లు రంగు కూడా మారిపోయే ప్రమాదం ఉంది.

రోజుకి రెండు సార్లు, 2 నిమిషాలు

ప్రతిరోజూ బ్రష్ చేసినప్పటికీ మన ఆహార అలవాట్ల కారణంగా దంతాలపై పొర లేదా ఎనామెల్ క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి భోజనం తర్వాత మీ నోటిని నీటితో శుభ్రం చేసుకోండి. వయస్సు మీ దంత ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మీ వయస్సు పెరిగే కొద్దీ మీ శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే మీ దంతాలు కూడా బలహీనపడటం ప్రారంభిస్తాయని గుర్తుంచుకోవాలి.

మీ దంతాలను కనీసం రెండు నిమిషాలు, రోజుకు రెండుసార్లు పూర్తిగా బ్రష్ చేయడం.. అనంతరం ఫ్లాసింగ్, మౌత్ వాష్‌తో దంతాల్ని శుభ్రం చేయడం ద్వారా బ్యాక్టీరియా మీ దంతాలను దెబ్బతీయకుండా ఆపవచ్చు. అయితే, ప్రమాదం కేవలం మీ దంతాలకే పరిమితం కాదు. పేలవమైన నోటి పరిశుభ్రత చిగుళ్ళు బలహీనంగా మార్చి రక్తస్రావం కావడానికి దారి తీస్తుంది. ఇది చాలా నొప్పిని కలిగించే చిగురువాపు వంటి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.

దంతాల ఎఫెక్ట్.. ఆరోగ్యంపై కూడా

ఆరోగ్యకరమైన నోరు ఆరోగ్యకరమైన శరీరానికి ప్రవేశ ద్వారం. ఆహారం, నీరు ఇలా ఏదైనా నోటిగుండా వెళుతుంది. కాబట్టి మీరు మీ నోటి పరిశుభ్రత పట్ల ఎక్కువ శ్రద్ధ చూపకపోతే మీ నోటిలో ఉండే బ్యాక్టీరియాతో ఆ ఆహారం మిక్స్ అవుతుంది. అది మీ జీర్ణక్రియ సమయంలో మీ ప్రేగులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఇన్ఫెక్షన్‌ల బారిన పడకూడదని అనుకుంటే దంతాల్ని నిత్యం శుభ్రంగా ఉంచుకోండి.

రోజుకు కనీసం రెండు సార్లు దంతాల్ని శుభ్రం చేసుకోవాలి. అలానే తీపి పదార్ధాలను తగ్గించడం, పళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. అన్నింటి కంటే ముఖ్యంగా ఏడాదికి కనీసం రెండు సార్లు డెంటిస్టు దగ్గరికి వెళ్లి మీ దంతాల్ని పరీక్ష చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024