AP Free Sand : రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి – పాల‌సీని స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వులు

Best Web Hosting Provider In India 2024

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ జీఎం ఎంస్ నంబ‌ర్ 64 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ట్రాక్టర్లకూ అవకాశం కల్పిస్తూ రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పేరుతో జారీ చేశారు. స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇసుక పాలసీలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజలకు ఇసుక కొరత రావదన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు వాడుకునేలా ప్రభుత్వం ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

స్థానిక అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

అమలులో ఉన్న ఇసుక విధానాలను (కొత్త ఇసుక మైనింగ్ విధానం 2019, అప్‌గ్రేడ్ చేసిన ఇసుక విధానం 2021) ఉపసంహరించుకుందని పేర్కొన్నారు. ఇసుక మైనింగ్ పాలసీని రూపొందించే వరకు ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకుండా వినియోగదారులకు ఇసుక సరఫరా చేయడానికి మధ్యంతర యంత్రాంగాన్ని జులై 8, 2024న ప్రవేశపెట్టింద‌ని ఉత్త‌ర్వుల్లో వివరించారు. ఇసుక‌ లభ్యతను నిర్ధారించే యంత్రాంగాన్ని మరింత మెరుగుపరచడానికి, వినియోగదారుకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా అందచేయడానికి సవరించిన ఉచిత ఇసుక సరఫరా మార్గదర్శకాలను 2024 సెప్టెంబ‌ర్ 2న ప్రవేశపెట్టింద‌ని ఉత్త‌ర్వుల్లో ప్రస్తావించారు.

వ్యక్తిగత ఉపయోగం లేదా గ్రామాలలో కమ్యూనిటీ పని కోసం గ్రామ పంచాయితీలో ఉన్న కాలువ‌లు, న‌దుల నుండి ఇసుక, సాధారణ మట్టిని సాంప్రదాయకంగా వెలికితీసేందుకు పర్యావరణ క్లియరెన్స్ అవసరం నుండి మినహాయింపు ఉందని 2024 అక్టోబ‌ర్ 17న కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ తెలిపారు. 2019-21 మధ్య కాలంలో ఇసుక కార్యకలాపాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ మైనింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఎండీసీ) నిర్వహిస్తుండగా… గ్రామాల్లో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతించబడింది.

అయితే 2024 సెప్టెంబ‌ర్ 2న మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులలో కేవ‌లం “ఎద్దుల బండ్ల ద్వారా స్థానిక అవసరాలకు ఇసుకను పొందవచ్చు” అని పేర్కొనబడింద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. అయితే దాన్ని స‌వ‌రిస్తూ సేకరించిన ఇసుక రవాణా కోసం ఎద్దుల బండ్లు, ట్రాక్టర్‌లను అనుమతించేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ జియాలజీ అభ్యర్థించారు.

ప్రభుత్వం ఆ విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత, కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. తదనుగుణంగా 2024 సెప్టెంబ‌ర్ 2న ఇచ్చిన ఉత్త‌ర్వుల్లో పారా ఏ (3) సవరణను చేసింది. “ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే స్థానిక అవసరాలకు ఇసుకను పొందవచ్చు” అని పేర్కొంది. దీనికి సంబంధిత అధికారులు త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటారుని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsEducationSand IssuesChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024