Andhra Pradesh : స్కూళ్లో బెంచీలపై చికిత్సనా.. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయింది : జగన్

Best Web Hosting Provider In India 2024

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయిందని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. అందుకు ఉదాహరణ.. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలేనని వ్యాఖ్యానించారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని విమర్శలు గుప్పించారు.

సమీపంలోనే విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా.. స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు.. ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయన్న మాజీ సీఎం.. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. లిక్కర్‌, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు.. ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

‘జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారు’ అని జగన్ ఆరోపించారు.

అతిసారంపై ఆందోళన..

విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం ప్రబలింది. 4 రోజుల వ్యవధిలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 మంది బాధితులు విజయనగరం, విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. మృతి చెందిన వారందరికీ అతిసారంతోపాటు గుండె, కిడ్నీ, బీపీ, షుగర్‌ వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Whats_app_banner

టాపిక్

VizianagaramYs JaganHealthAndhra Pradesh NewsUttarandhra
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024