Sunday Tips: ఆదివారం మీరు ఈ పనులు చేయగలిగితే.. మిగిలిన 6 రోజులు మీకు హ్యాపీడేస్!

Best Web Hosting Provider In India 2024

ఆదివారం వచ్చిందంటే చాలు.. కొంత మందికి ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంటుంది. ఉదయం నిద్రలేవడంతో మొదలయ్యే ఆ బద్ధకం రాత్రి పడుకునే వరకూ వారిని వీడదు. మళ్లీ సోమవారం ఉదయం నుంచి హడావుడి జీవితం మొదలు. కానీ.. ఆదివారం రోజున కొన్ని పనులు చేస్తే మీరు వారం అంతా హ్యాపీగా ఉండొచ్చు. మనం చాలా మంది లైట్ తీసుకునే ఆ పనులే.. మీ వారం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. కానీ.. వాటినే మనం నిర్లక్ష్యం చేస్తూ వారం మొత్తాన్ని గజిబిజి గందరగోళంగా గడిపేస్తుంటాం.

ఆదివారం చేయాల్సిన పనులివే

ఆదివారం రోజు అయినంత మాత్రానా సూర్యోదయం వరకు పడుకోవాల్సిన పనిలేదు. కాస్త ముందుగానే లేచి మీ శారీరక ఆరోగ్యానికి అదనపు సమయం కేటాయించండి. అలానే మానసిక ఆరోగ్యం కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. దాంతో మీ ఆదివారం మరింత ఉల్లాసంగా, ఆనందంగా గడపగలుగుతారు. మీరు బ్యాచిలర్ అయితే.. ఆదివారం దుస్తులు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులను చేసుకోవడం మంచిది. దాని వల్ల వారం మధ్యలో మీకు తిప్పలు తప్పుతాయి.

వారానికి సరిపడా బట్టలు

ఒకవేళ మీరు ఫ్యామిలీ మెంబర్ అయితే.. బట్టలు ఉతకడం, ఐరెన్ చేయడం లాంటి పనుల్లో భాగస్వామికి సాయం చేయండి. అలానే వారానికి సరిపడా బట్టల్ని సిద్ధం చేసుకుని సపరేటుగా ఉంచుకోండి. దాని వల్ల ప్రతి రోజూ మీరు ఉదయాన్నే బట్టలు వెతుక్కునే బాధ మీకు తప్పుతుంది. మీ పిల్లల స్కూల్ బ్యాగ్స్, మీరు ఆఫీస్‌కి తీసుకెళ్లే బ్యాగ్‌ను శుభ్రం చేసుకోండి.

పుట్టిన రోజులు, పంక్షన్లు

ఆదివారం ఉదయమే వారం పొడవునా చేయాల్సిన ముఖ్యమైన పనులను గుర్తు చేసుకుని.. వీలైతే ఒక పేపర్‌పై రాసి పెట్టుకోండి. అలానే మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ల పుట్టినరోజు వేడుకలు లేదా బంధువుల వేడుకలు తేదీలు ఉంటే వాటిని గుర్తుచేసుకుని రాసుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోజు మీకు హడావుడి తప్పుతుంది. అలానే ముందస్తు ప్లానింగ్‌తో ఏం కొనాలి? ఎలా వెళ్లాలి? అనేదానిపై మీకూ ఓ క్లారిటీ వస్తుంది.

సరుకులు, సామాన్లు

వారానికి సరిపడా ఫ్రిజ్, కిచెన్‌లోకి అవసరమైన సరుకుల జాబితాని మీ భాగస్వామితో మాట్లాడి సిద్ధం చేసుకోండి. దీనివల్ల వారం మధ్య మధ్యలో అవి తీసుకురా.. ఇవి తీసుకురా అని మీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చే చికాకు తప్పుతుంది. ఒకవేళ మీరు పొరపాటున మర్చిపోతే భాగస్వామితో వాదనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆదివారం ఓ 10 నిమిషాలు సమయం కేటాయించుకుని ముందే లిస్ట్ రెడీ చేసుకుంటే.. వారం అంతా తాపీగా ఉండొచ్చు.

ఫ్యామిలీతో టైమ్

ఆదివారం వచ్చింది కదా అని గంటల కొద్దీ ఫోన్ లేదా టీవీ చూడటం కంటే.. సరదాగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడండి. ఇండోర్ గేమ్స్‌ను మీ భాగస్వామి, పిల్లలతో కలిసి ఆటలు ఆడండి. ఇది మీ మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది. సాయంత్రం వేళ వీలైతే సరదాగా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్లండి.

హాబీని ఎంజాయ్

ఆదివారం కాసేపైనా మీకు మీకు ఇష్టమైన హాబీలకి సమయం కేటాయించండి. కాసేపు బుక్ చదవడం, సంగీతం వినడం, సినిమా చూడటం, గార్డెనింగ్ ఇలా మీకు ఏది సంతృప్తిని ఇస్తుంది అనుకుంటే.. ఆ పనిని చేస్తూ మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. అలానే మధ్యాహ్నం పూట వీలైతే కాసేపు కునుకు కూడా తీయండి. వంటగదిలో మీ భాగస్వామి సాయం చేయండి. వీలైతే వంట చేసి మీ ఇంట్లో వాళ్లకి వడ్డించండి.

నీట్‌నెస్ ముఖ్యం

ఇంటిని శుభ్రం చేయడానికి, చెల్లా చెదురుగా ఉన్న వస్తువులను నీట్‌గా సర్దడానికి సమయం కేటాయించండి. ఇంట్లో అన్నీ శుభ్రంగా ఉంటేనే మీ మనసు, ఆలోచనలు శుభ్రంగా ఉంటాయని గుర్తుంచుకోండి. మీ స్నేహితులతో మాట్లాడటం వీలైతే పర్సనల్‌గా కలిసి సరదాగా కాసేపు మాట్లాడటం చేయండి. సాయంత్రం వేళ గుడి లేదా మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి కాసేపు రిలాక్స్ అవ్వండి.

ఆదివారం రాత్రి రివ్యూ

ప్రతి ఆదివారం నిద్రపోయే ముందు ఈ వారం ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకోండి. మధుర క్షణాలను నెమరువేసుకోండి, చేదు అనుభవాలు గుర్తు చేసుకుని మరోసారి అలాంటివి ఎదురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. అలానే మీరు చేసిన తప్పిదాలను కూడా గుర్తు చేసుకుని.. పునరావృతం చేయకూడదని మీలో మీరు నిశ్చయించుకోండి.

మీ భాగస్వామితో వారం గడిచిన తీరు గురించి చెప్పండి.. అలానే వాళ్లు గడిపిన తీరుని కూడా ఓపికగా వినండి. అన్నింటికంటే ముఖ్యంగా ఆదివారం తెల్లవారుజామున లేవడం ఎంత ముఖ్యమో సరైన సమయానికి నిద్రపోవడం కూడా అంతే కీలకం. మీరు ఎలా గడిపినా ఆదివారం గడిచిపోతుంది. కానీ.. ఇలా చేయడం వల్ల మీ వారం మొత్తం హ్యాపీగా, సాఫీగా సాగిపోద్ది..!

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024