Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/10/11251_1729436291765_1729436298460.jpg)
బరువు ఎక్కువగా ఉండటం వల్ల లేని పోని ఆరోగ్య సమస్యలు అన్నీ వచ్చి పడతాయి. అందుకనే చాలా మంది బరువును ఎలాగోలా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాయామాలు, కసరత్తులతో చమటోడ్చి మరీ ఎలాగోలా బరువును తగ్గించుకుంటారు. అయితే కొంత మందికి మాత్రం అటు తిండిని నియంత్రించుకోవడమూ కష్టంగానే ఉంటుంది. ఇటు వ్యాయామాలు చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. ఇలా లేజీగా ఉండే వారు కూడా తేలిగ్గా చేసుకోగల వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.
హ్యాపీ బేబీ పోజ్ :
చిన్న పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతున్నప్పుడు వారు ఒక రకమైన పోజ్‌లో పడుకుంటారు. నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లని చేతులతో పట్టుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. గుర్తొచ్చిందా? అచ్చంగా అలాంటి భంగిమలోనే కాసేపు ఉండాలి. కాళ్లను ఛాతీ దగ్గరకు తెచ్చుకుని చేతులతో వాటిని పట్టుకుని వీలైనంత సేపు అలా ఉండాలి. కావాలనుకుంటే 20, 30 సెకన్లకు ఒకసారి కాళ్లను నిదానంగా చాపుకుని మళ్లీ ప్రయత్నించవచ్చు. అందువల్ల పొట్ట నరాలపై ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలు పెడుతుంది. దీన్ని మంచం మీద విశ్రాంతిగా పడుకున్నప్పుడు కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండొచ్చు.
ప్లాంక్స్ :
పరుపు మీద పడుకుని ఉన్నా దీన్ని చేసుకోవడానికి వీలవుతుంది. ముందు బోర్లా నిదానంగా పడుకోవాలి. తర్వాత కాలి వేళ్లు, మోచేతుల దగ్గర నుంచి చేతుల వరకు నేలకు ఆనించి, మిగిలిన శరీరం అంతటినీ గాల్లోకి లేపాలి. అలా నిమిషం పాటు ఉండేందుకు ప్రయత్నించాలి. తర్వాత మళ్లీ సాధారణంగా పడుకోవాలి. ఇలా రోజుకు 20 వరకు ప్లాంక్స్‌ని సాధన చేయవచ్చు. అయితే మరీ మెత్తగా ఉండే పరుపుల మీద దీన్ని చేయడం కష్టం అవుతుంది.
క్యాట్ కౌ పోజ్ :
ముందుగా నేలపై బోర్లా పడుకోండి. తర్వాత మెల్లగా లేచి మోకాళ్ల మీద నిలబడండి. ఇప్పుడు శరీరాన్ని మెల్లగా వంచండి. చిన్న పిల్లలు పాకే వయసులో ఎలాంటి భంగిమలో ఉంటారో అలాగన్న మాట. అలా ఒక నిమిషంపాటు ఉన్న తర్వాత మెడను మెల్లగా భూమి వైపుకు వంచండి. ఇలా మరో అరనిమిషం పాటు ఉండండి. తర్వాత సాధారణంగా పడుకోండి. ఇలా 15 నుంచి 20 సార్లు చేయవచ్చు.
ఈ మూడు వ్యాయామాల వల్ల శరీరం ఎలా కావాలంటే అలా కదులుతుంది. కేలరీలూ కరుగుతాయి.