Cyclone Dana : దానా తుపాను నుంచి ఏపీ సేఫ్​? ఆ రెండు రాష్ట్రాలపై మాత్రం భారీ ఎఫెక్ట్​..!

Best Web Hosting Provider In India 2024


ఒడిశా తీరంవైపు దూసుకొస్తున్న దానా తుపానుపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. మధ్య అండమాన్ సముద్రంపై ప్రస్తుతం ఉన్న వాయుగుండం.. అక్టోబర్ 23(బుధవారం) నాటికి దానా తుపానుగా బలపడి వాయువ్య బంగాళాఖాతం చేరుకుంటుందని ఐఎండీ (భారత వాతావరణశాఖ) చెబుతోంది. అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

దానా తుపానుతో ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​..!

ఐఎండీ ప్రకారం.. ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​పై దానా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. అక్టోబర్​ 23న ఒడిశా తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. కానీ తుపాను తీరానికి సమీపిస్తున్న కొద్ది, తీరం దాటిన తర్వాత.. అంటే అక్టోబర్​ 24, 25 తేదీల్లో ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం పూరీ, ఖుర్దు, గంజన్​, జగత్​సింగ్​ఫూర్​ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు.

దానా తుపాను నేపథ్యంలో అటు పశ్చిమ్​ బెంగాల్​లోని తీర ప్రాంతాల్లో ఈ నెల 23న తేలికపాటి వర్షాలు పడతాయి. కానీ అక్టోబర్​ 24, 25 తేదీల్లో పశ్చిమ్​ బెంగాల్​లోని గంగానది తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. హౌరా, తూర్పు- పశ్చిమ మేదినిపొర, నార్త్​- సౌత్​ 24 పరగణాస్​లో బుధ, గురువారాలు భారీ నుంచి అతి భారీ వానలు పడొచ్చు.

దానా తుపాను కారణంగా రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవ్వొచ్చని, విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. కొండచరియలు విరిగే ప్రమాదం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా పాత, శిథిలావస్తకు చేరుకున్న ఇళ్లల్లో ఉండకూడదని సూచించింది.

ఐఎండీ డైరక్టర్​ జనరల్​ మృత్యుంజయ్​ మొహపాత్ర ప్రకారం.. గురు, శుక్రవారాల్లో తీర ప్రాంతాల్లో 20సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవ్వొచ్చు. కొన్ని చోట్ల గరిష్ఠంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రికార్డ్​ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్​లో కూడా వర్షాలు కురుస్తాయి, కానీ దానా తుపాను ప్రభావం భారీగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అక్టోబర్​ 24, 25 తేదీల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దానా తుపాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 21 వరకు అండమాన్ సముద్రంలో, అక్టోబర్ 22, 24 తేదీల్లో మధ్య బంగాళాఖాతం, అక్టోబర్ 24 నుంచి 25 వరకు ఉత్తర బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు.

ఈ తుపానుకు దానా అనే పేరును సౌదీ అరేబియా ఇచ్చింది. “దానా” అనే పేరు అరబిక్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం “ఉదారత” లేదా “బహుమానం” అని వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link