Karimnagar Milling Issue: సన్నాల సమస్య… మిల్లింగ్ కు ససేమిరా అంటున్న మిల్లర్స్, సన్న వరి సాగుతో సమస్యలు

Best Web Hosting Provider In India 2024

Karimnagar Milling Issue: తెలంగాణలో సన్న వరి సాగు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. సాగు పెరగడంతో క్వింటాకు 67 శాతం బియ్యం ఇవ్వలేమని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. మిల్లింగ్ నిబంధనలు సడలించి క్వింటాకు కొంత పరిహారం, కస్టోడియన్, మిల్లింగ్, రవాణా ఛార్జీలు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్ కు తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. మిల్లర్ల మెలికతో సన్నధాన్యం సేకరణ సమస్యగా మారుతుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో 11.75 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 20.59 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనాకొచ్చారు. ఇందుకోసం 1,360 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ఈసారి 31 రకాల సన్నధాన్యాన్ని పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మునుపెన్నడూ లేని విధంగా వానాకాలం సీజన్లో అత్యధిక శాతం సన్నాలు సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో 3,90,967 ఎకరాల్లో సన్నాలు సాగైంది. కరీంనగర్ జిల్లాలో 2,48,623 మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 1,72,150 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 3.44 లక్షల మెట్రిక్ టన్నులు, రాజన్న సిరిసిల్లలో 28,457 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాకొచ్చారు.

మొత్తంగా 7.93 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రత్యేక కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్ధం చేశారు. సన్నాలకు కేంద్రం క్వింటాల్ కు రూ.2,320 మద్దతు ధర చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కలిపి రూ.2,820 చొప్పున కొనుగోలు చేయనుంది.

సన్నాలను సర్కారే కొని… రేషన్ బియ్యంగా సప్లై..

సన్నాళ్లకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం, ఐకెపి, సహకార సంఘాలు ద్వారా కొనుగోలు చేసి మిల్లర్స్ కు అప్పగించి మిల్లింగ్ చేశాక ప్రభుత్వమే తీసుకోనుంది. దొడ్డు ధాన్యంతో వచ్చే బియ్యాన్ని ఎప్సీఐ (భారత ఆహార సంస్థ)కు వెళతాయి. అయితే సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేశాక వచ్చే బియ్యాన్ని వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు, సంక్షేమ వసతి గృహాలకు ఉపయోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

కానీ సన్న ధాన్యం మిల్లింగ్ కు మిల్లర్లు ససేమిరా అనడంతో ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాతే సన్నధాన్యం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు సడలించాలని రా రైస్ మిల్లర్స్ కోరుతున్నారు.

సమస్యకు కారణాలు..

సాధారణంగా దొడ్డు రకం దాన్యం మిల్లింగ్ చేస్తే క్వింటాకు 67 కిలోల బియ్యం వస్తాయి. అదే సన్న రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే 57 కిలోలకు మించి బియ్యం రావని మిల్లర్లు అంటున్నారు. దొడ్డు, సన్నాలకు చెందిన ఏ రకం ధాన్యం మిల్లింగ్ చేసినా క్వింటాకు రూ.67 కిలోల బియ్యం సీఎంఆర్ కింద అప్పగించాల్సి ఉంటుంది.

సన్నరకాలను తీసుకొని మిల్లింగ్ చేస్తే క్వింటాకు 10 కిలోల బియ్యం తక్కువగా వస్తుందని, ఈ లోటును ఎవరు భరిస్తారని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. పైగా 17 శాతం తేమ ఉన్న సన్నరకం ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటే 20 రోజుల్లో రంగు మారిపోయే ప్రమాదం ఉందని, ఇవే బియ్యాన్ని మిల్లింగ్ చేస్తే బియ్యం తీసుకునే సమయంలో నాణ్యత లేదంటూ అధికారులు కొర్రీలు పెడితే తాము నష్టపోతామని వాపోతున్నారు.

అందుకే తేమ నిబంధనను 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని.. సన్న బియ్యం సరఫరాలో క్వింటాకు రూ.300 పరిహారం, కస్టోడియన్, మిల్లింగ్, రవాణా ఛార్జీలు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తూ ఈ సమస్య పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్ కు తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. క్వింటాకు ఎన్ని కిలోల బియ్యం వచ్చినా తీసుకునేలా నిబంధన సడలించాలని కోరుతున్నారు. దీంతోపాటు 20 ఏళ్లుగా మిల్లింగ్ చార్జీలు పెంచకపోవడంతో అనేక సమస్యల తమను వేధిస్తున్నాయని అంటున్నారు.

రారైస్ క్వింటాకు రూ.30 చెల్లిస్తున్నారని, పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, కార్మికుల కూలీలు కలిపితే తమకు అసలే గిట్టుబాటు కావడం లేదంటున్నారు మిల్లర్లు. ప్రభుత్వం నుంచి ఇంకా ఏ నిర్ణయం రాకపోవడంతో సన్నాల కొనుగోళ్ళు ఇంకా జరగడం లేదు. ప్రైవేట్ ట్రేడర్స్, వ్యాపారులు సన్నాలను తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

RicePaddy ProcurementKarimnagarGovernment Of TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024