Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/10/ogne_1729436698040_1729436713961.jpg)
గోంగూరతో చేసే పచ్చడి గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ దాని పువ్వుతోనూ అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు. చెప్పాలంటే ఈ పువ్వుతో చేసే పచ్చడి ఆకుతో చేసే పచ్చడి కన్నా బాగుంటుంది. దీన్నే తెలంగాణ లోని ప్రాంతాల్లో పుంటి పువ్వు అనీ అంటారు. చూడ్డానికి ఎర్రగా ఉంటుందిది. పువ్వు మధ్యలో గింజ ఉంటుంది. గింజ తీసేసి పువ్వు రెక్కలు వేరు చేసి పచ్చడి తయారీకి వాడుకోవాలి. ఈ పుంటి పువ్వు లేదా గోంగూర పువ్వు పచ్చడి తయారీ ఎలాగో చూసేయండి.
పుంటి పువ్వు పచ్చడి తయారీకి కావాల్సినవి:
పావు కేజీ పుంటి పువ్వు
నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు
పావు టీస్పూన్ మెంతులు
2 చెంచాల నూనె
అర చెంచా కారం
పావు కప్పు బెల్లం
అర టీస్పూన్ పసుపు
టీస్పూన్ ధనియాలు
అర టీస్పూన్ జీలకర్ర
అర చెంచాడు ఉప్పు
పుంటి పువ్వు పచ్చడి తయారీ విధానం:
- పుంటి పువ్వు లేదా గోంగూర పువ్వులో జామ్, పప్పు, పచ్చడి చేసుకోవచ్చు. దీనికుండే పులుపుదనం వల్ల వంటలకు ప్రత్యేక రుచి వస్తుంది. కేవలం పువ్వు నుంచి రేకులను వేరు చేసి మిగతా భాగం అంతా పడేయాలి. ఆ రేకులను శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోండి.
- కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. వేడెక్కాక మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకుని వేయించుకోండి.
- అవి కాస్త వేగగానే అందులో పుంటి పువ్వు రేకుల్ని వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టుకుని కనీసం రెండు మూడు నిమిషాలు మీడియం మంట మీద మగ్గించుకోండి.
- కాసేపటికి పువ్వు బాగా ఉడికి పోయి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు అందులో బెల్లం తరుగు, పసుపు వేసుకోండి. అన్నీ ఒకసారి కలియబెట్టి మళ్లీ మూత పెట్టేయండి.
- ఓ నిమిషం అయ్యాక కారం, ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ కట్టేసుకోండి.
- ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేసుకుంటే పుంటి పువ్వు తొక్కు రెడీ.
- దీన్ని ఇలాగే తినొచ్చు. లేదా మళ్లీ నూనెలో ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఆ తాలింపును పచ్చడిలో కలుపుకోవచ్చు.
టాపిక్