Cyber Crime : జగిత్యాల వ్యక్తి పేరిట హైదరాబాద్ బ్యాంకుల్లో రూ.20 లక్షల లోన్- ఫేక్ ఆధార్, పాన్ కార్డుతో సైబర్ మోసం

Best Web Hosting Provider In India 2024


సైబర్ నేరగాళ్ళు సరికొత్త మోసానికి తెర లేపారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి బ్యాంకులను నమ్మించారు. ఒకటి కాదు రెండు కాదు ఏడు బ్యాంకుల్లో 20 లక్షలు లోన్ తీసుకున్నారు. ఆరేళ్ళ క్రితం లోన్ తీసుకోగా, ఆధార్ కార్డుపై పేరు గల వ్యక్తి క్రాప్ లోన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళితే ఘరానా మోసం బయటపడింది. జగిత్యాల జిల్లాకు చెందిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను, జిల్లా అధికారులను ఆశ్రయించాడు.

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ ఆధార్ కార్డును ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు మోసానికి పాల్పడ్డారు. నారాయణ ఆధార్ కార్డుపై ఫోటోను మార్చి పాన్ కార్డు సృష్టించారు. పాన్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డును ఉపయోగించి హైదరాబాద్ లోని ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. ఈ లోన్ 2018 లో తీసుకొని ఇప్పటివరకు రూపాయి చెల్లించలేదు. గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నుంచి లోన్ అమౌంట్ ఎప్పుడూ చెల్లిస్తారని నారాయణకు ఫోన్ లు రావడంతో అవాక్కయ్యాడు. ఇటీవల ఫేక్ కాల్స్, సైబర్ నేరగాళ్ల ఫోన్లు వస్తుండడంతో అలాంటిదే అనుకోని పట్టించుకోకుండా వదిలేశాడు.

క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే

నారాయణ తనకున్న భూమిపై క్రాప్ లో తీసుకునేందుకు స్థానికంగా బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నారాయణ ఆధార్ కార్డు, పాన్ కార్డుతో బ్యాంకులో సెర్చ్ చేయగా సిబిల్ స్కోర్ తగ్గడంతో పాటు డిఫాల్టర్ గా చూపింది. ఇదివరకే నీ పేరు పై లోన్ ఉందని ప్రస్తుతం లోన్ ఇవ్వలేమని బ్యాంక్ అధికారి చెప్పడంతో ఏమి చేయాలో అర్థం కాని నారాయణ లోన్ అమౌంట్ కట్టాలని ఫోన్ లు వచ్చే బ్యాంకుల గురించి ఆరా తీశాడు. అసలు తాను లోన్ తీసుకోలేదని…మీరు ఏం ఆధారం చూసి లోన్ ఇచ్చారని ప్రశ్నించడంతో ఆధార్ కార్డు పాన్ కార్డు నారాయణ కు పంపించారు. బ్యాంక్ బ్యాంకర్లు పంపించిన ఆధార్ కార్డు పాన్ కార్డు పరిశీలిస్తే అందులో ఫోటో నారాయణది కాదు… ఇది సైబర్ నేరగాళ్లు చేసిన మోసమని గుర్తించి పోలీసులు ఆశ్రయించాడు.

పట్టించుకోని పోలీసులు.. ప్రజావాణిలో ఫిర్యాదు

మోసపోయిన నారాయణ బుగ్గారం పోలీసులను ఆశ్రయించగా సైబర్ క్రైమ్ బ్యూరోలో ఫిర్యాదు చేయాలని సూచించారు. వారి సూచన మేరకు హైదరాబాదుకు వెళ్లి సైబర్ క్రైమ్ బ్యూరోలో ఫిర్యాదు చేయగా ఎలాంటి స్పందన లేకపోవడం… లోన్ ఇచ్చిన బ్యాంకుల నుంచి వేధింపులు పెరగడంతో జగిత్యాల కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లను కొనసాగిస్తూ ఫోటో మార్చి దుండగులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫేక్ ఐడీ లోన్ ఇచ్చిన బ్యాంకుల వేధింపుల నుంచి విముక్తి కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. క్రాప్ లోన్ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నాడు.

విచారణ చేపట్టిన పోలీసులు

ప్రజావాణిలో నారాయణ ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశంతో పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరగాళ్ళ పనే అయి ఉంటుందని భావిస్తూ సైబర్ క్రైమ్ బ్యూరోలో కేసు నమోదు చేసి ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నారాయణ ఆధార్ కార్డ్ తో సైబర్ నేరగాళ్లు ఫేక్ పాన్ కార్డు సృష్టించి బ్యాంకులను నమ్మించి లోన్ తీసుకొని మోసం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCrime TelanganaTelugu NewsJagtial Assembly ConstituencyCybercrimeHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024