Best Web Hosting Provider In India 2024
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల, రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. మెడికల్ హబ్ గా కరీంనగర్ మారిందని బండి సంజయ్ కేంద్ర మంత్రికి వివరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్ కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. గ్రానైట్ పరిశ్రమ, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులతో వలస కార్మికులు ఎక్కువమంది పనిచేస్తున్నారని తెలిపారు. వారందరు ప్రభుత్వ పరంగా వైద్యం పొందడానికి ఈఎస్ఐ ఆసుపత్రి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంవల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. బండి సంజయ్ విజ్ఝప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ అతి త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్