Tattoos: చిన్న ట్యాటూకు లోతైన అర్థం, ఆసక్తికర ట్యాటూ డిజైన్లు మీరూ చూడండి

Best Web Hosting Provider In India 2024

పచ్చబొట్టుకు ట్రెండీ పదం ట్యాటూ. ఇది వరకు సాంప్రదాయం ప్రకారం లేదా కొన్ని సంస్కృతుల వల్ల పచ్చబొట్టు వేయించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు యువతకు పచ్చబొట్టు అంటే ఫ్యాషన్ స్టేట్‌మెంట్ లాంటిది. వాళ్ల మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా ట్యాటూలు వేయించుకుంటున్నారు. కొంతమంది ప్రేమజంటలైతే కపుల్ ట్యాటూలూ వేసుకోవడం చూసే ఉంటాం. ఈ ట్రెండ్ సెలిబ్రిటీల నుంచి మనదాకా వచ్చేసింది.

ట్యాటూ అనగానే అపాదమస్తకం పెద్దగా ఉండక్కర్లేదు. చిన్న చుక్కతో అయినా పెద్ద భావం వ్యక్తపర్చొచ్చు. ఇప్పుడు అలా చిన్న సైజులో ఉండి పెద్ద భావం తెలియజేసే ట్యాటూలకే ట్రెండ్ ఎక్కువ. అలాంటి ట్యాటూ డిజైన్లు, వాటి అర్థాలు వివరంగా చూసేద్దాం.

1. కమలం (Lotus):

కమలానికి మరో పేరు పంకజం. అంటే బురదలో పుట్టింది అని అర్థం. బురదలో పుట్టినా పువ్వు స్వచ్ఛంగా ఉంటుంది.ఆ బురద పువ్వుకు అంటదు. అందుకే ఈ కమలం పువ్వును పవిత్ర చిహ్నంగా భావిస్తారు. ఇది స్వచ్ఛతను, ఆధ్యాత్మికతను, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. కష్టాల్లో నుంచి శక్తిలా ఎదిగి బయటపడొచ్చనే సందేశం ఇస్తుంది. అందుకే కష్టాలు తట్టుకుని విజయం సాధించిన వాళ్లు చాలా మంది కమలాన్ని ట్యాటూగా వేయించుకోవాలి అనుకుంటారు.

2. వృత్తం ( Circle):

చిన్న వృత్తం ట్యాటూకి చాలా అర్థం ఉంది. అది చంద్రుణ్ని, సూర్యుణ్ని సూచిస్తుంది. సమయం అయిపోతుందని తెలియజేస్తుంది. ఈ ఆకారానికి మొదలు, చివర ఉండవు. జీవితమనే చక్రాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. సంపూర్ణత్వాన్ని, పరిపూర్ణతను, అనంతాన్ని తెలియజేసే చిహ్నం ఇది.

3. భాణం (Arrow):

చిన్న భాణం గుర్తుకు చాలా పెద్ద అర్థం. భాణాన్ని గురిపెట్టాలంటే ముందుగా వెనక్కి లాగాలి. జీవితం మిమ్మల్ని కష్టాల్లో పడేస్తూ వెనక్కి నెట్టేస్తే, వాటిని ఎదుర్కుంటూ మీరు ముందుకు వెళ్లి మీ లక్ష్యం సాధిస్తారని ఈ చిహ్నం చెబుతుంది. మీ గురి ఎప్పుడూ భవిష్యత్తు మీదే కానీ గతం మీద కాదని తెలియజేస్తుంది.

4. దిక్సూచి లేదా కంపాస్ స్టార్ (Compass star):

మీరు గమనిస్తే సముద్ర ప్రయాణాలు చేసేవాళ్లు, జాళర్లు ఎక్కువగా దిక్సూచిని సూచించే నక్షత్రం ఆకారాన్ని ట్యాటూ వేయించుకుంటారు. దానికి సంస్కృతి పరమైన కారణాలున్నా.. అర్థం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రాత్రి పూట కూడా చీకట్లో వాళ్ల మార్గాన్ని వాళ్లకి ఇది తెలియజేస్తుంది. గమ్య స్థానానికి భద్రంగా చేరుస్తుంది. అందుకు భవిష్యత్తుకు మార్గం చూపే చిహ్నంగా దీన్ని భావిస్తారు.

5. హవర్ గ్లాస్ (Hour glass):

సమయం కోసం వాడే హవర్ గ్లాస్ ట్యాటూకు చాలా అర్థాలున్నాయి. దీంట్లో ఒక భాగం ఇసుకతో నిండి ఉంటే, మరో వైపు ఖాళీ అవుతుంది. ఇది మన జీవితంలో పాటించాల్సిన సమతుల్యతను గుర్తుచేస్తుంది. సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేస్తుంది. అలాగే కొనల దగ్గర కాస్త వంపి గీస్తే హవర్ గ్లాస్ కాస్తా ఇన్ఫినిటీ గుర్తు లాగా అనిపిస్తుంది. కాబట్టి ఇది అనంతాన్ని, అనంతమైన ప్రేమకు చిహ్నంలాగా కొంతమంది భావిస్తారు.

ఇలా చాలా రకాల గుర్తులకు బోలెడు పరమార్థాలున్నాయి. ట్యాటూ డిజైన్ చేయడం ఒక కళ. ఎప్పటికీ చెరిగిపోని ముద్ర. కాబట్టి మీరు ట్యాటూ వేయించుకోవాలనుకుంటే ఏ గుర్తుకు అయినా దాని అర్థాన్ని పూర్తిగా తెల్సుకోండి. సరిగ్గా తెల్సుకున్నాక, మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ట్యాటూ ఎంచుకోండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024