Polavaram : పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద న‌వంబ‌ర్ 6 నుంచి 10 వ‌ర‌కు వ‌ర్క్‌షాప్.. నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైన‌ సీడ‌బ్ల్యూసీ

Best Web Hosting Provider In India 2024


అంత‌ర్జాతీయ నిపుణుల క‌మిటీ సిపార్సుల మేర‌కు.. పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద వ‌చ్చే నెల 6 నుంచి 10 వ‌ర‌కు వ‌ర్క్ షాప్ జరగనుంది. ఈలోగా పోల‌వ‌రం ప్రాజెక్టు ఎగువ కాఫ‌ర్ డ్యాం, దిగువ కాఫ‌ర్ డ్యాంల మ‌ధ్య ప్ర‌ధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో.. సీపేజీ నీటిని పూర్తిగా తోడివేయాల‌ని పోల‌వ‌రం ప్రాజెక్టు అధికారుల‌ను సీడ‌బ్ల్యూసీ ఆదేశించింది. ఈ వర్క్‌షాప్‌లో అంత‌ర్జాతీయ నిపుణులు, పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ (సీడ‌బ్ల్యూసీ) పాల్గొంటారు.

డ‌యాఫ్రం వాల్ నీరు ముంచే ప్రాంతాన్ని స‌ముద్ర మ‌ట్టానికి 17 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఇసుక‌తో నింపి.. వైబ్రో కాంపాక్ష‌న్ చేసిన ప్లాట్‌ఫాంను సిద్ధం చేయాల‌ని సీడ‌బ్ల్యూసీ సూచించింది. న‌వంబ‌ర్ 6 తేదీన అంత‌ర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడ‌బ్ల్యూసీ అధికారుల బృందం పోల‌వ‌రం ప్రాజెక్టు వద్ద‌కు చేరుకోనుంది. ఐదు రోజుల పాటు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై వ‌ర్క్‌షాప్‌లో చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటారు.

కొత్త డ‌యాఫ్రం వాల్ నిర్మించే విధానంతో పాటు.. గ్యాప్‌-1, గ్యాస్-2ల‌లో ప్ర‌ధాన డ్యాం డిజైన్‌ను ఈ స‌మావేశంలో ఖ‌రారు చేయ‌నున్నారు. సీడ‌బ్ల్యూసీ ఆదేశం మేర‌కు కాఫ‌ర్ డ్యాంల మ‌ధ్య నీటిని తోడే ప‌నుల‌ను కాంట్రాక్టు సంస్థ మేఘా ముమ్మ‌రం చేసింది. గోదావ‌రి వ‌ర‌ద‌ల ఉధృతికి కోత‌కు గురై ప్ర‌ధాన డ్యాం ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకున్న ప్ర‌దేశాన్ని.. మే నాటికే స‌ముద్ర మ‌ట్టానికి 16 మీట‌ర్ల ఎత్తుతో ఇసుకను నింపి, వైబ్రో కాంపాక్ష‌న్ చేసే ప‌నులు పూర్తి చేసింది.

సీపేజీ నీటిని పూర్తిగా తోడేశాక అంత‌ర్జాతీయ నిపుణ‌ల క‌మిటీ సిఫార్సు మేర‌కు.. ప్ర‌ధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మ‌రో మీట‌రు ఎత్తు పెంచ‌డానికి ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తోంది. డ‌యాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే బెంట‌నైట్ మిశ్రమం, కాంక్రీట్‌ను వ‌ర్క్‌షాప్‌లో ప‌రీక్ష‌ల నిమిత్తం సిద్ధంగా ఉంచారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేర‌కు ప‌నుల‌ను వేగ‌వంతం చేసింది.

ఇప్ప‌టికే కేంద్ర మంత్రి వర్గం పోలవ‌రం ప్రాజెక్టు స‌వ‌రించిన అంచ‌నాలకు ఆమోదం తెలిపింది. తొలిద‌శ ప‌నులకు సంబంధించిన కొత్త డీపీఆర్‌కు రూ.30,436.95 కోట్ల‌కు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. గ‌తంలో 2010-11 ధ‌ర‌ల సూచీతో రూ.16,010.45 కోట్ల‌కు డీపీఆర్ ఆమోదం పొందింది. కొత్త డీపీఆర్ ఆమోదంతో అద‌నంగా రూ.12,157.53 కోట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

Polavaram ProjectAndhra Pradesh NewsAp Lrrigation
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024