Breakfast: రసగుల్లాలు కావివి.. గోలీ ఇడ్లీలు. రెసిపీ చూసేయండి

Best Web Hosting Provider In India 2024

గోలీ ఇడ్లీలంటే చిన్నగా గుండ్రంగా ఉంటాయి. చూడ్డానికి రసగుల్లానో, మరింకేదో స్వీట్ లాగో అనిపిస్తాయి. కానీ పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకోదగ్గ ఇన్స్టంట్ ఇడ్లీ రెసిపీ ఇది. తయారీ చూసేయండి.

గోలీ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

రెండు కప్పుల బియ్యం పిండి

రెండు కప్పుల నీళ్లు

అరచెంచా ఉప్పు

2 చెంచాల నెయ్యి లేదా నూనె

తాలింపు కోసం:

అర చెంచా ఆవాలు

అర చెంచా శనగపప్పు

అర చెంచా మినపప్పు

2 చెంచాల నువ్వులు

2 ఎండుమిర్చి

చిటికెడు ఇంగువ

2 పచ్చిమిర్చి, సన్నటి తరుగు

అంగుళం అల్లం ముక్క, సన్నం ముక్కల తరుగు

2 చెంచాల కొత్తిమీర తరుగు

గోలీ ఇడ్లీ తయారీ విధానం:

  1. ముందుగా ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో నీళ్లు పోసుకోండి. కొద్దిగా ఉప్పు, నెయ్యి కూడా వేసుకుని వేడి చేసుకోండి.
  2. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక ఉడుకు రాగానే అందులో బియ్యం పిండి వేసుకుని కలుపుకోండి.
  3. పిండికి సమానంగా నీళ్లు తీసుకుంటే సరిగ్గా సరిపోతాయి. పిండి నీళ్లంతా పీల్చేసుకుంటుంది. బాగా ముద్దలాగా తయారవుతుంది.
  4. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సన్నం మంట మీద పెట్టి కనీసం ఓ అయిదు నిమిషాలు వదిలేయండి. దాంతో పిండి కాస్త తేమగా ముద్దగా అయిపోతుంది.
  5. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ ముద్దను ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోండి. చేత్తో చపాతీ పిండి కలిపినట్లు బాగా కలుపుకోండి.
  6. అవసరం అనుకుంటే మీద కొద్దిగా వేడి నీళ్లు చల్లుకుంటూ పిండి కలుపుకోండి. ఇప్పుడు అందులో నుంచి కొద్దికొద్దిగా పిండి తీసుకుని చిన్న ఉండలు లేదా గోలీలు చేసుకోండి.
  7. ఈ గోలీలను ఇడ్లీ కుక్కర్ పాత్రల్లో పెట్టి ఉడికించుకోవాలి. కనీసం పది నిమిషాలయినా ఆవిరి మీద ఉడకాలి.
  8. తాలింపు కోసం చెంచాడు నూనె వేడి చేసుకుని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకోండి. వెంటనే అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి.
  9. కాస్త వేగాక ఈ తాలింపును ఆవిరి మీద ఉడికించుకున్న గోలీ ఇడ్లీల మీద వేసి అంతా అంటుకునేలా కలిపేసుకోండి. అంతే గోలీ ఇడ్లీలు రెడీ. కొత్తిమీర చల్లుకుని దింపేసుకుంటే చాలు.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024