Best Web Hosting Provider In India 2024
దీపావళి రోజున చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ఇంటి అలంకరణ ఒకటి. అయితే దీపావళి రోజు చేయాల్సిన పనులు ఇంకా అనేకం ఉంటాయి. కాబట్టి ఇంటికి డెకరేషన్ చేసేందుకు తీరిక దొరకదు. పండుగకు ముందు ఇంటిని శుభ్రం చేయడంలోనే గడుపుతారు, అలంకరణ పనిని చివరి నిమిషం వరకు వదిలివేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలో అర్థం కాక ఇబ్బంది పడతారు. అది కూడా తక్కువ సమయంలోనే ఇంటిని ఎలా సిద్ధం చేయాలా అని ఆలోచిస్తారు. ఈ రోజు మేము మీ కోసం అలాంటి కొన్ని అలంకరణ చిట్కాలు చెబుతున్నాము. వీటిని ఫాలో అయితే తక్కువ సమయంలోనే, తక్కువ శ్రమతో మీ ఇంటి రూపాన్ని మార్చేయచ్చు.
మీరు తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా అలంకరించాలనుకుంటే, మొదట ఏ వస్తువులు కావాలో జాబితా తయారు చేయండి. ముందు ఏం కొనాలో, ఎక్కడ నుంచి డెకరేషన్ మొదలు పెట్టాలో ఒక చోట రాసుకోండి, వాటిని క్రమపద్ధతిలో చేసేందుకు సిద్ధమవండి. పనుల జాబితాలో మొదటి ప్రాధాన్యత పూజ గదిని అలంకరించేందుకు ఇవ్వండి.
ఇంటి లివింగ్ ఏరియాను బాగా అలంకరించండి. అతిధులు వచ్చి చూసేది లివింగ్ రూమ్‌నే కాబట్టి. అక్కడ ఉన్న కర్టెన్లు, కుషన్ కవర్లు, సోఫా కవర్లు వంటి వాటిని మార్చండి. కొత్త, అందమైన కవర్లను వాటికి వేయండి. మీ లివింగ్ ప్రాంతంలో కొత్త అందమైన షోపీస్ లను పెట్టండి. ఎలక్ట్రానిక్ లైట్లతో అలంకరించండి. ఇంట్లో ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్క చుట్టూ లైట్లు అమర్చండి. ఇది చీకటి పడ్డాక ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరణ చేయడం మర్చిపోకూడదు. దీన్ని సులువుగా డెకరేట్ చేయవచ్చు. ఇది ఇంటి రూపానికి కొత్తదనాన్ని అందిస్తుంది. మెయిన్ డోర్ మీద అందమైన తోరణాలు పెట్టుకోవచ్చు. వీటితో పాటు పూలదండలతో, తలుపుల అలంకరణ కూడా చేయవచ్చు. గేటు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అలంకరించవచ్చు. వేలాడే మొక్కలు, లైట్లు, ప్లాస్టిక్ పూల సహాయంతో ఈ భాగాన్ని అలంకరించి ఇంటికి జీవం పోయవచ్చు.
చివరి క్షణంలో రంగోలి
ఇంటి లోపల ఎంత అలంకరించినా ఇంటి గుమ్మం ముందు రంగోలీ వేయకపోతే ఏమాత్రం బాగోదు. ఏ రంగోలి వేయడాలో ముందే నిర్ణయించుకోండి. ప్లాస్టిక్ షీట్లపై (స్టెన్సిల్స్) ఉన్న రంగురంగుల ముగ్గులను గుమ్మం ముందు అచ్చు వేయచ్చు. వాటిపైనే పువ్వులను చల్లి రంగోలికి మరింత అందాన్ని తేవచ్చు. ఇది చాలా అందంగా కనిపించడమే కాదు, త్వరగా పూర్తవుతుంది.
ఒక పెద్ద ఇత్తడి గిన్నెలో నీళ్లు పోసి దానిపైన పూలను చల్లి ఇంటికి ఒక మూల లేదా లివింగ్ రూమ్ లో పెడితే ఎంతో అందంగా కనిపిస్తుంది. మామిడి కొమ్మలను గుమ్మానికి వేలాడదీయడం కూడా చాలా సులువు.
బంతిపూలు, చామంతి పూల తక్కువ ధరకే లభిస్తాయి. వాటిని ఎక్కువగా కొని రేకులను వేరు చేయాలి. ఆ రేకులను లివింగ్ రూమ్ లోని గోడల వెంబడి వేయండి. ఇది ఇంటికి ప్రత్యేక అందాన్ని తెస్తుంది.
టాపిక్