Best Web Hosting Provider In India 2024
Thunder Blast: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తయారీ కేంద్రం సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో సూర్యారావుపాలెం-కాల్దారి రహదారిలో సాయి ఫైర్ వర్క్ పేరుతో వేగిరోతు రామ శివాజీ బాణసంచా తయారీ కేంద్రాన్ని రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఈ కేంద్రంలో బుధవారం సాయంత్రం శివాజీ, ఆయన భార్య శ్రీవల్లి, మరో 13 మంది కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా భారీవర్షం పడింది. ఈ కేంద్రానికి సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడే ధాటికి మందుగుండు సామగ్రి కాలడంతో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో శివాజీ భార్య శ్రీవల్లి (35), పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రవిపాడుకు చెందిన గుమ్మడి సునీత (38) సజీవ దహనం అయ్యారు.
మశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన కమిడి కుమారి (50), చుక్కా పెద్దింట్లు (45), పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన మందలంక కమలరత్నం (400, నీలం లక్ష్మి (45), జంగారెడ్డి గూడేం కాలయపాడు వాసి చెందిన విప్పర్తి వెంకటేశ్వరరావు (50) తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కారణంగా అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఉండ్రాజవరం ఎస్ఐ జి. శ్రీనివాస్ తన వాహనంలో ఐదుగురు క్షతగ్రాతులను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
90 శాతం కాలిన గాయాలతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. దీంతో దీపావళి పర్వదినానికి సమయత్తమవుతున్న వేళ ఆ ప్రాంతం వణికిపోయింది. పిడుగుపాటుతో ఒక్కసారిగా తల్లడిల్లింది. అక్కడివారి ఆర్తనాదాలతో శోకసంద్రంగా మారింది. అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు వదలగా, కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.
ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన తొమ్మిది మంది కార్మికులు పొలాల్లో పరుగులు తీస్తూ రక్షించాలంటూ కేకలు వేశారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 108 అత్యవసర వాహనం దాదాపు గంటన్నర ఆలస్యంగా తణుకు నుంచి చేరుకోవడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి వరకు బాధితులంతా రోదనలతో అక్కడే తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అప్పుడు తల్లిదండ్రులు..ఇప్పుడు భార్య
వేగిరోతు రామ శివాజీ బాణసంచా తయారీ అప్పుడు తల్లిదండ్రులను, ఇప్పుడు భార్యను పొట్టన పెట్టుకుంది. ఏడేళ్ల క్రితం దువ్వలోని తన నివాసంలో బాణసంచా నిల్వలు పేలడంతో రామశివాజీ తల్లిదండ్రులు సజీవదహనం అయ్యారు. ఇప్పుడు భార్య చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యులు ముగ్గురిని తాను నమ్మకున్న కుటీర పరిశ్రమే మింగేయడాన్ని రామ శివాజీ జీర్ణించుకోలేకపోతున్నాడు. రామ శివాజీ భార్య శ్రీవల్లి పిడుగుపాటుకు గంట ముందు వచ్చి ఒకరికి చిచ్చుబుడ్డు విక్రయించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరో రెండు తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లగా ఘటన జరగడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఘటన పట్ల సీఎం, మాజీ సీఎం విచారం
ఇద్దరు మహిళలు మరణించడం, ఐదుగురికి తీవ్ర గాయాలవ్వడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు. గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ ఘటన పట్ల రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నారాముడు, కొవ్వూరు ఆర్‌డీవో రాణిసుస్మిత పరిశీలించారు. తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయని, బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్