Best Web Hosting Provider In India 2024
దీపావళి పండుగ ఆనందాన్ని, సంపదను తీసుకొచ్చే వేడుక. భారతదేశమంతటా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఇంట్లో దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు కొన్ని ఆచారాలు, నమ్మకాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో దీపావళి దీపాలతో కాటుక తయారు చేయడం కూడా ఒకటి. సాధారణంగానే కాటుకను కంటికి అలంకరణగా వాడుతారు. దీపావళి సందర్భంగా ఇంట్లో కాటుకను సేంద్రీయ పద్ధతిలో తయారుచేసి దాన్ని ధరిస్తే ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఇది మిమ్మల్ని చెడు చూపు నుండి కాపాడుతుందని చెబుతారు.
ప్రాంతాన్ని బట్టి కాటుకను ఒక్కోచోట ఒక్కోలా పిలుస్తారు. కొంతమంది కాజల్ అని పిలిస్తే, మరికొందరు కోహ్ల్ అని అంటారు. దీన్ని సాధారణ పదార్థాలతోనే తయారు చేస్తారు. ఇది అందాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కంటికి రక్షణగా నిలుస్తుంది. సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన కాటుకను వాడితేనే… దానివల్ల కలిగే ఔషధ ప్రయోజనాలు కంటికి అందుతాయి. కాటుకను నూనెలు లేదా కొవ్వు లాంటి పదార్థాలను కాల్చడం వల్ల ఏర్పడే మసితో తయారుచేస్తారు. దీన్ని దీపావళి దీపాలతో ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
దీపాలతో కాటుక తయారీ
దీపావళి సమయంలో భారతదేశంలోని అనేక ఇళ్లల్లో కాటుకను సేంద్రీయ పద్ధతిలో తయారుచేసి వాటిని ఇంట్లోని వారికి పెడతారు. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న ప్రతికూలత పోతుందని నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందని చెబుతారు. ఇది ఇంట్లోని చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా వాడుతారు. అయితే దీన్ని తయారీ ఎలాగో తెలుసుకోండి. దీపాన్ని పెట్టాక ఆ మంటపై ఒక స్టీల్ ప్లేట్ ను కొంత ఎత్తులో పెట్టి పట్టుకోండి, లేదా ఒక పెద్ద గిన్నెను దానిపై బోర్లించండి. ఒక పావు గంట తర్వాత చూస్తే ఆ స్టీలు గిన్నెకు నల్లటి మసి అంటుకుంటుంది. దాన్ని స్పూన్ తో సేకరించి ఒక చిన్న గిన్నెలో వేయండి. అంతే దీపావళినాడు పెట్టుకునే కాటుక రెడీ అయినట్టే. దీన్ని మీతో పాటు మీ ఇంట్లోనే వారందరికీ అప్లై చేయండి.
దీపావళి నాడు ఇలా దీపాలతో తయారుచేసిన కాటుకను పెట్టుకుంటే ఆ ఏడాదంతా మీకు సంపద, సమృద్ధిగా దొరుకుతుందని, ఇతరుల చెడు చూపు మీపై పడకుండా ఉంటుందని ఒక నమ్మకం ఉంది. ఇది చాలా సింపుల్ ప్రక్రియే. కాబట్టి కాజల్‌ను ఇలా తయారు చేసి పెట్టుకోవడం మీకు పెద్ద కష్టమేమీ కాదు. మీకు కాటుక పెట్టుకోవడం వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం వంటివి ఉంటే మాత్రం ఈ పద్ధతిని మానేయాలి. ఎలాంటి అలెర్జీలు లేనప్పుడు మీరు చక్కగా ఈ కాటుకను ధరించవచ్చు.
టాపిక్