Best Web Hosting Provider In India 2024
వెలుగుల పండుగ దీపావళి, దెయ్యాల వేడుక హాలోవీన్… ఈ రెండు పండగలు ఈఏడాది అక్టోబర్ 31నే నిర్వహించుకోనున్నారు. దీపావళిని రాక్షసులను అంతమొందించినందుకు వేడుకలా చేసుకుంటే, హాలోవీన్ మాత్రం దెయ్యాలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని పండుగల చేసుకుంటారు. దీపావళి వెనకాల ఎన్ని కథలు ముడిపడి ఉన్నాయో హాలోవిన్ వెనక కూడా అన్నే కథలు ఉన్నాయి. దీన్ని కూడా వేల సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నట్టు చరిత్ర చెబుతోంది.
హాలోవీన్ చరిత్ర ఇదే
హాలోవీన్ మూలాలు 2000 సంవత్సరాల క్రితమే ఉన్నట్టు చరిత్రకారులు చెబుతారు. ఐర్లాండ్, బ్రిటన్, ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతాలలో జీవించిన సెల్ట్ అని పిలిచే తెగవారు దీన్ని నిర్వహించుకునే వారని అంటారు. సంహైన్ అని పిలిచే కాలంలో దీన్ని ప్రముఖంగా చేసుకునేవారు. సంహైన్ అనేది శీతాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. పంటకాలం ముగుస్తున్నట్టు ఈ సంహైన్ చెబుతుంది. అందుకే ఈ కాలాన్ని వారు చీకటి రోజులుగా భావిస్తారు.
అక్టోబర్ 31 రాత్రి మంచి ఆత్మలు, చెడు ఆత్మలు రెండూ కూడా భూమిపై సంచరించడానికి వస్తాయని, ఆ రాత్రి చనిపోయిన వారి రాజ్యంగా మారిపోతుందని సెల్ట్ తెగవారు నమ్ముతారు. అందుకే మరణించిన వారిని గౌరవించడానికి, వారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి పెద్ద పెద్ద మంటలను వేసేవారని అంటారు. అలాగే వారు కూడా దెయ్యాల్లాగే దుస్తులు ధరించి తిరిగేవారని చెబుతారు. అదే కాలం గడుస్తున్న కొద్ది దెయ్యాల పండుగ హాలోవీన్ గా మారిపోయిందని అంటారు.
రోమ్‌లో కూడా ఫెరాలియా అని పిలిచే దెయ్యాల పండుగ నిర్వహించుకుంటారు. దీన్ని కూడా అక్టోబర్ చివరిలోనే నిర్వహించుకుంటారు. మరణించిన వారిని గౌరవించడానికి ఈ పండుగను చేసుకుంటారు. హాలోవీన్ సంప్రదాయాలతోనే దీన్ని కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా పురాతన సెల్ట్ తెగవారి ఆలోచనలే అని చెప్పుకుంటారు. హాలోవీన్ అమెరికాలో అతి పెద్ద పండుగగా ఇప్పుడు మారిపోయింది. ప్రభుత్వం హాలోవీన్ రోజు సెలవు దినాలను కూడా ప్రకటిస్తుంది. తమ దేశం అంతా వేడుకలను వైభవంగా జరిగేలా చూస్తుంది.
హాలోవీన్ రోజు అమెరికన్లు ఒక్కొక్కరు ఒక్కోరకంగా విచిత్రంగా తయారవుతారు. మరికొందరు దయ్యాలు, భూతాలు, పిశాచాల్లా తయారై వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అలాగే స్వీట్లను, చాక్లెట్లను కూడా పంచుకుంటారు. ఇది పేరుకు దెయ్యాల పండుగ అయినా చాలామంది ఆనందాన్ని కలిగించే వేడుకగా చెప్పుకోవచ్చు.
హాలోవీన్ పండుగను ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో నిర్వహించుకుంటారని చెబుతారు. ప్రతి ఏడాది అక్టోబరు 31నే ఈ పండుగను చేసుకుంటారు.హాలోవీన్ పదం అనేది క్రైస్తవ మూలానికి చెందినదని అంటారు. హాలోవీన్ కు కొన్ని దేశాల్లో విపరీతమైన ప్రాచుర్యం ఉంది. ఎన్నో సినిమాలు హాలోవీన్ నేపథ్యంలో వచ్చాయి. హాలోవీన్ మార్కెట్ కూడా అమెరికాలో భారీగా సాగుతుంది. ముఖ్యంగా గుమ్మడికాయలను అధికంగా కొంటారు.
ఈ పండుగ కోసం ప్రత్యేకంగా అమెరికాలో గుమ్మడికాయలను పండిస్తారు. వాటిని చెక్కి లోపల లైట్లను పెట్టి రాత్రి పూట భయపెట్టే విధంగా ఇంటి ముందు పెడతారు. ఇలా పెట్టడం వల్ల చెడు ఆత్మలు భయపడి వెళ్లిపోతాయని, తమ ఇంటికి రావని నమ్ముతారు.
టాపిక్