OTS Scam: విజయవాడలో వన్‌టైమ్‌ సెటిల్‌‌మెంట్‌ దందా.. వరదల్లో మునిగిన వాహనాలకు అందని బీమా పరిహారం

Best Web Hosting Provider In India 2024

OTS Scam: విజయవాడ బుడమేరు వరదల్లో మునిగిన వేలాది వాహనాలకు పరిహారం చెల్లింపులో బీమా కంపెనీల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వరదలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లింపు మాత్రం కొలిక్కి రావడం లేదు. వాహనాల డీలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, సెకండ్‌ హ్యాండ్ వెహికల్‌ విక్రేతలు కుమ్మక్కై వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ పేరుతో చౌకగా వాహనాలను కొట్టేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని భయపెట్టి, కొర్రీలు వేసి అరకొరగా పరిహారం చెల్లిస్తున్నారు.

గత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు విజయవాడలో 32 డివిజన్లలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. వరదల్లో వేలాది వాహనాలు నీట మునగడంతో వాటి యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఆటోల వరకు ప్రభుత్వం పరిహారం చెల్లించినా సొంత కార్లు, ట్రావెల్స్‌ నిర్వాహకులు, టాక్సీలు బాగా నష్టపోయారు. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లించకుండా వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని ఒత్తిళ్లకు గురి చేస్తుండటంతో చాలా మంది అరకొర పరిహారంతో సరిపెట్టుకున్నారు.

వాహనాల డీలర్లు మరమ్మతు ఖర్చులకు భారీగా అంచనాలు రూపొందించి, ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించే పరిహారం కంటే ఎక్కువ ఖర్చవుతుందని ఎస్టిమేషన్లు ఇస్తున్నారు. దీంతో బాధితులు ఆ భారం భరించలేక వచ్చిన కాడికి వాహనాలు వదిలేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై నియంత్రణ లేక పోవడం, ఫిర్యాదు చేయడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడంతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాహనాల డీలర్లు, షోరూమ్‌లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు కలిసి కట్టుగా సాగిస్తున్న దందాలో ఇప్పటికే వందలాది మంది వాహనాలను కారు చౌక ధరలకు వదులుకోవాల్సి వచ్చింది.

బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి

బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు.

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు నష్టపోయిన వాహనదారులకు బీమా చెల్లింపు దరఖాస్తుల్లో ఇంకా 262 పెండింగులో ఉండటంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విశాఖపట్నంలో హుదుద్ తుపాన్ వచ్చిన సమయంలో కేవలం నెల రోజుల్లోపే బాధితులకు బీమా సొమ్మును అందించామని, ఆ తరహాలో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

పెండింగులో ఉన్న క్లెయిమ్ దరఖాస్తులన్నీ 15 రోజుల్లో పరిష్కరించి బాధితుల ఖాతాలో బీమా సొమ్ము జమ చేయాలని బీమా సంస్థల ప్రతినిధులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా లబ్ధిదారుల జాబితాను వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు.

వరదల్లో దెబ్బతిన్న చిరు వ్యాపారులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. వరదలకు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో స్వయంగా చూశానని….ఏ ఒక్కరికీ సాయం అందకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

Whats_app_banner

టాపిక్

InsuranceFraudsCheatingBudameruVijayawada FloodsChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024